చిలుకలూరిపేట వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చాలా కాలం అయింది. అయితే రాజీనామాను మండలి చైర్మన్ ఇంత వరకూ ఆమోదించలేదు. ఆయన ఆమోదించినా లేకపోయినా టీడీపీలో చేరిపోవాలని మర్రి రాజశేఖర్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మరో ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరిపోయారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి జగన్ రెడ్డి మానసిక వికృతానికి బలైపోయిన నేత. ఆయన వైసీపీ కోసం పార్టీ పెట్టినప్పటి నుండి పని చేస్తే.. 2019లో చివరి క్షణంలో టీడీపీలో ఉండి జగన్ను రాక్షసుడు అని మహానాడులో తిట్టి వైరల్ అయిన విడదల రజనీని చేర్చుకున్నారు. డబ్బులు బాగా ఖర్చు పెడతామని హామీ ఇవ్వడంతో మర్రి రాజశేఖర్ ను పక్కన పెట్టి టిక్కెట్ ఇచ్చారు. ఆమె కోసం పని చేసి గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ రెడ్డి చిలుకలూరిపేట నడిబొడ్డున హామీ ఇచ్చారు. మంత్రి కాదు కదా చివరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికే నానా తిప్పలు పెట్టారు. మర్రి రాజశేఖర్ సామాజికవర్గాన్ని తీవ్రంగా ద్వేషించే జగన్.. ఆయన జీవితాన్ని అలా నిర్వీర్యం చేశారు.
చివరికి విడదల రజనీ అన్ని అరాచకాలు చేసి పేటలో గెలవరని తేలాక గుంటూరు పంపించారు. అప్పుడైనా మర్రికి టిక్కెట్ ఇవ్వలేదు. గుంటూరు నుంచి మనోహర్ నాయుడుకు చాన్సిచ్చారు. అంతా అయిపోయాక మళ్లీ విడదల రజనీనే చిలుకలూరిపేటకు తెచ్చారు కానీ.. మర్రి గురించి పట్టించుకోలేదు. దీంతో ఆయన రాజీనామా చేసేశారు. ఇప్పుడు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.