ఒకేసారి… రెండు సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే మాటలు కాదు. ఆ ఫీట్ సాధించాడు మారుతి. గోపీచంద్ `పక్కా కమర్షియల్` సినిమా కి కాస్త గ్యాప్ వస్తే… ఆ విరామంలో ఓ కథ రాసుకోవడం, సినిమా తీసేయడం జరిగిపోయాయి. శోభన్ తో చేసిన `మంచి రోజులొచ్చాయి` ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. నిజానికి `మంచి రోజులు వచ్చాయి` ప్రయోగాత్మకంగా తీసిన సినిమా. తక్కువ బడ్జెట్ లో, తక్కువ టైమ్ లో ఓ సినిమా తీసి, దాన్ని ఓటీటీకి ఇచ్చి, లాభాలు చేసుకోవాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. కేవలం ఓటీటీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రయత్నం ఇది. ఈ సినిమా ఎఫెక్ట్ `పక్కా కమర్షియల్`పై పడకుండా ఉండడానికి మారుతి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమాని లో ప్రొఫైల్ లో ఉంచాడు. సినిమా మొదలైనా, ఆ వివరాలు బయటకు రానివ్వలేదు. పైగా దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు.
ఇప్పుడు మారుతికి ధైర్యం వచ్చినట్టైంది. ఈ సినిమాకి దర్శకుడిగా తన పేరు వేసుకుని ప్రచారం మొదలెట్టాడు. `పక్కా కమర్షియల్ `లాంటి సినిమా పక్కన పెట్టి, ఓ సినిమాని విడుదల చేయడం పెద్ద రిస్క్. పైగా `పక్కా కమర్షియల్` గీతా ఆర్ట్స్, యూవీల ఉమ్మడి చిత్రం. అలాంటి పెద్ద నిర్మాతల్ని ఒప్పించి, ఈ గ్యాప్ లో ఓ సినిమా తీయగలిగాడు మారుతి. ఇప్పుడు ప్రచారం కూడా మొదలెట్టాడు. అంటే… `మంచి రోజులు వచ్చాయి`పై మారుతికి గురి కుదిరిందన్నమాట. పైగా ఇప్పుడు ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నార్ట. యూవీ, గీతా ఆర్ట్స్ల ప్రోత్సాహం, అనుమతి లేనిదే మారుతి ఈ స్టెప్ తీసుకోలేడు. వాళ్లు కూడా ఓకే అన్నారంటే – సినిమాపై అందరికీ గురి కుదిరినట్టే.