వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పర్యవేక్షణాధిరిని సీబీఐ మార్చింది. ప్రస్తుతం డీఐజీ ర్యాంక్‌లో ఉన్న సుధా సింగ్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. 44 రోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ బృందం.. అదే పనిగా… పని మనుషుల్ని…డ్రైవర్ని.. వాచ్‌మెన్‌ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కనీసం ఓ పది సార్లు వివేకా ఇంటిని పరిశీలించి ఉంటారు. కానీ ఇప్పటికి ఏం తేల్చారో మాత్రం క్లారిటీలేదు. కేసు దర్యాప్తులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సీబీఐ ఉన్నతాధికారులు సుధాసింగ్ స్థానంలో ఎస్పీ క్యాడర్లో ఉన్న రామ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
వివేకా హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు.. ఇంకా వైఎస్ సునీత ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పదిహేను మంది ప్రధాన నిందితుల్ని .. వరుసగా ప్రశ్నిస్తే..చిక్కు ముడి వీడిపోతుంది. కానీ సీబీఐ అధికారులు అసలు అనుమానితుల జోలికి వెళ్లడంలేదు. సీబీఐ అధికారుల తీరుపై వైఎస్ సునీత కూడా అసహనంతో ఉన్నారు. సీబీఐ అధికారులుకేసును చేధించాలన్న ఎజెండాతో కాకుండా.. మరో కారణంతో కాలయాపన చేస్తున్నారని.. అసలు నిందితుల్ని కాకుండా.. కేసును ఏదో విధంగా ముగించాలన్న ప్రయత్నంలో ఉన్నారన్న అనుమానంతో వివేకా కుమార్తె ఉన్నారని అంటున్నారు.
ఏ కేసులో అయినా సాక్ష్యాలు తుడిపేసినోళ్లే ప్రధాన అనుమానితులు. వివేకా హత్య కేసులో ఆయన హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేసినవాళ్లు కళ్ల ముందే ఉన్నారు. మృతదేహానికి కళ్లు కట్టించిన వారు… రక్తపు మరకల్ని తుడిచేసిన వారూ కళ్ల ముందే ఉన్నారు. వివేకారాసిన లెటర్ అంటూ తెర మీదుకు వచ్చిన లెటర్ఎవరు రాశారో కనిపెట్టడం కూడా పెద్ద విషయం కాదు. అయినా సీబీఐ అధికారులు… అసలు ఈ వ్యవహారాలపై పోవడం లేదు. ఫలితంగా కడపలోనే సీబీఐ విచారణపై జోకులు పేలుతున్నాయి. నెలరోజుల పాటు పులివెందులలో గడిపి.. అతి సులువైన కేసును పరిష్కరించలేకపోతే.. సీబీఐ ఇమేజ్ ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. 44 రోజుల తర్వాత కొత్త అధికారిని తెరపైకి తెచ్చారు.