బిజెపి నేతల దారుణాలు…మీడియా మేనేజ్‌మెంట్ ఆ స్థాయిలో

కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చుకుంటే ఒక విషయంలో మాత్రం బిజెపి అత్యద్భుత విజయం సాధించిందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ బిజెపి పార్టీ అనడం కంటే కూడా నరేంద్రమోడీ, అమిత్ షా అని చెప్తే ఇంకా కరెక్ట్‌గా ఉంటుంది. ఇందిరాగాంధీ టైం నుంచి కూడా మీడియాను కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని చాలా మంది నాయకులే ట్రై చేశారు. కానీ ఆ నాయకులెవ్వరికీ సాధ్యం కాని విజయాన్ని మోడీ సాధించేశాడు. ఆప్ నేతలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, ఆప్ నేతలు మహిళలను హెరాస్ చేశారు, రేప్ చేశారు అనే స్థాయి వార్తలు నేషనల్ మీడియాలోనూ, ప్రాంతీయ మీడియాలోనూ ఏ స్థాయిలో హల్చల్ చేశాయో గుర్తుందిగా. మరి ఒక మహిళ బిజెపి ఎంపిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేస్తే ఎందుకు హైలైట్ అవ్వలేదు. పైగా ఆరోపణలు చేసిన మహిళపైనే ఖిలాడీ లేడీ అన్న ముద్ర ఎందుకు వేశారు? ఆ ఎంపి వివరణ కూడా చాలా అనుమానాలు రేకెత్తించినప్పటికీ మీడియాకు అదేమీ కనిపించకపోవడం ఏంటి? తన సమస్యను వినడానికి హోటల్‌కి రమ్మని ఆ మహిళ అడిగిందట. ఈ ఎంపిగారు వెళ్ళారట. అక్కడ ఈ ఎంపిగారికి ఇచ్చిన డ్రింక్‌లో మత్తుమందు కలిపి అసభ్యంగా ఉండేలా వీడియోలు, ఫోటోలు తీసుకుని ఈ ఎంపిగారిని డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. ఈ మాటలు ఎక్కడైనా నమ్మశక్యంగా ఉన్నాయా?

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిర్చి రైతులకు వరం అని చెప్పి భజన మీడియా బ్రహ్మాండంగా న్యూస్ అచ్చేశారు. ఈ దెబ్బతో మిర్చి రైతులకు పండగ అనే స్థాయిలో చెప్పారు. మరి ఆ స్థాయి వరం ఇచ్చిన తర్వాత కూడా ఖమ్మంలోనూ, గుంటూరులోనూ రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? అంటే మీడియా వాళ్ళకు కనిపించిన వరం రైతులకు ఎందుకు కనిపించడం లేదు? యోగి పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే ఒక గ్రూప్ జనాలు వేరే వర్గం వ్యక్తిని చంపేసిన ఘటన మీడియాకు పెద్ద న్యూస్‌గా ఎందుకు కనిపించలేదు. ఇక యోగి కూడా రైతు రుణమాఫీని చంద్రబాబు స్టైల్‌లోనే చేశాడన్న విషయం మీడియాకు తెలియదా? మీడియా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్తారు కానీ ఇప్పుడు ఇండియన్ మీడియాలో ఎక్కువ భాగం భజన పాత్రని మాత్రం బ్రహ్మాండంగా పోషిస్తున్నారని అనిపిస్తోంది. ఒక హిందూ యోగిని ముఖ్యమంత్రిగా నియమించడంపై ఎక్కడ విమర్శలు వస్తాయో అని చెప్పి ..ఆ యోగి సమర్థత గురించి ఆయన దేవుడు అనే స్థాయిలో మీడియాలో కనిపించిన వార్తలే అందుకు ప్రబల సాక్ష్యం.

భజన చేసుకుని బాగుపడడం అనేది ఇంతకుముందు రాజకీయాలకు మాత్రం పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల సమస్యల విషయంలో కూడా అలానే చేస్తున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందేమోనన్న ఉద్ధేశ్యంతో చాలా జాగ్రత్తగా వార్తలు వండుతున్నారు. పదవిలో లేని నాయకుల విషయంలో నిర్ధాక్షిణ్యంగా విమర్శలు చేస్తూ ప్రజల తరపున పనిచేస్తున్నామన్న కలరింగ్ ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రులతో పాటు బిజెపి వారి మీడియా మేనేజ్‌మెంట్ కూడా ఆ స్థాయిలో ఉంది మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com