ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా బాధ్యత కేవలం వార్తలను చేరవేయడమే కాదు, రాజ్యాంగ విలువల ఉల్లంఘన జరిగినప్పుడు నిలదీయడం కూడా. కానీ, దురదృష్టవశాత్తూ తెలుగు మీడియాలో ఒక వర్గం ఇప్పుడు ఒక వైపే చూస్తోంది. కొన్ని పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇన్సైడ్ స్టోరీలను గంటల తరబడి అల్లే ఛానళ్లు, వ్యవస్థలను అగౌరవపరుస్తున్న నేతలను మాత్రం నిలదీయడం లేదు. బూతులు తిట్టే సంస్కృతిని, అరాచక వాదాన్ని ప్రశ్నించే ధైర్యం లేని మీడియా, వారికి వత్తాసు పలికే వారిని మాత్రం హైలైట్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తోంది.
జగన్ అసెంబ్లీ బహిష్కరణను ప్రశ్నించరా?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజలుఎన్నికున్న ఎమ్మెల్యే. ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని మీడియా కనీసం తప్పుబట్టకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజలు తమ గొంతుకను సభలో వినిపిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే, ఆ బాధ్యతను విస్మరించి అసెంబ్లీని బహిష్కరించడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ప్రజాస్వామ్య దేవాలయానికి వెళ్లకుండా, బయట కూర్చుని ప్రకటనలు చేస్తే వాటిని బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేస్తున్న మీడియా.. అసలు మీరు సభకు ఎందుకు వెళ్లడం లేదు అని ఒక్కసారి కూడా సూటిగా ప్రశ్నించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రజాద్రోహానికి పరోక్ష సహకారం
ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరిస్తే అది కేవలం ఒక పార్టీ నిర్ణయం మాత్రమే కాదు, అది ఓటర్లకు చేసే ద్రోహం. ఈ రాజ్యాంగ విరుద్ధమైన ధోరణిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన మీడియా, ఆ తప్పును సరిదిద్దాల్సింది పోయి దానికి ప్రచారకర్తగా మారుతోంది. వ్యవస్థలను గౌరవించని నేతలు చెలరేగిపోతుంటే, వారికి మీడియా కవరేజ్ ఇచ్చి పరోక్షంగా ప్రోత్సహించడం ప్రజాస్వామ్య పునాదులకే ముప్పు. విమర్శలను స్వీకరించని, ప్రశ్నించని మీడియా ఉన్నంత కాలం నాయకుల్లో జవాబుదారీతనం ఉండదు.
రాజకీయ నేతల తప్పులను ప్రశ్నించలేనంత దైన్యమా?
రాజకీయ నాయకులు చేసే పొరపాట్లను సామాన్యుల కోణం నుంచి చూడాల్సిన మీడియా, ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. సభకు వెళ్లని నేతను నిలదీయకపోవడం అంటే ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టడమే. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ పద్ధతులను గౌరవించని నేతలు ఎంతటి వారైనా మీడియా కడిగిపారేయాలి. కానీ, ఆ ధైర్యం లేని పక్షపాత వైఖరి వల్ల ప్రజాస్వామ్యం రోజురోజుకూ బలహీనపడుతోంది. ఈ తరహా పాత్రికేయం సమాజానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తుంది.
