థియేటర్ల పతనం, ఓటీల గుత్తాధిపత్యం గురించి ఎప్పుడు చర్చకు వచ్చినా 8 వారాల నిబంధన గుర్తొస్తుంటుంది. సినిమా రిలీజ్ అయిన 8 వారాల వరకూ ఓటీటీల్లో రాకపోతే, థియేటర్లు బాగుపడతాయన్నది అందరి మాట. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? 8 వారాలకు సినిమాలు తీసుకోవడానికి ఓటీటీలూ ఓకే. కానీ నిర్మాతల్లో ధైర్యం చేసేదెవరు?
ప్రస్తుతం 8 వారాల నిబంధన గురించి నిర్మాతల్లో చర్చ నడుస్తోంది. అందరూ కలిసి కట్టుగా ఓ నిర్ణయానికి రావాలనే ఉద్దేశం ఛాంబర్ లో సుదీర్ఘమైన సమావేశాలు సాగుతున్నాయి. కానీ కొంతమంది పెద్ద నిర్మాతలు మాత్రం ఈ నిబంధనకు వ్యతిరేకం అంటున్నారు. ఎంతమంచి సినిమా తీసినా, జనం థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదని, అలాంటప్పుడు ఓటీటీల నుంచి వచ్చే నికరమైన రాబడిని తగ్గించుకోవడం ఎందున్నది వారి ప్రశ్న. యేడాదికి నాలుగైదు సినిమాలు తీసే, రన్నింగ్ ప్రొడ్యూసర్లే ఓటీటీలకు లొంగిపోతే.. ఇక అప్పుడప్పుడూ సినిమాలు తీసే వాళ్ల పరిస్థితేంటి? కొత్త నిర్మాతలైతే మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు.
ఓటీటీలకు తమ ఫ్లాట్ ఫామ్ లో సినిమా 4 వారాలకు వచ్చినా 8 వారాలకు వచ్చినా ఓకే. కానీ వాళ్ల షరతులు వాళ్లవి. సినిమా చూశాక, నచ్చితేనే కొంటారు. లేదంటే సినిమా రిలీజ్ అయిన తరవాత ఆ సినిమా సాధించిన వసూళ్లని ఆధారంగా చేసుకొని, ఓ రేట్ ఫిక్స్ చేస్తారు. ఫ్లాప్ అయితే అస్సలు పట్టించుకోరు. అప్పుడు పే ఫర్ వ్యూ పద్ధతిలో కూడా సినిమాల్ని ప్రదర్శించడానికి ఓటీటీలు ఒప్పుకోవు. ఈ సమీకరణాలు నిర్మాతల్ని భయపెడుతున్నాయి. ఒకవేళ సినిమాని ఓటీటీకి అమ్ముకోకపోతే, ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయితే పరిస్థితి ఏమిటి అనే కంగారు వాళ్లది. అందుకే ఈ రిస్క్ తీసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.
”సినిమాలు వారం, రెండువారాలకు మించి థియేటర్లో ఉండడం లేదు. అలాంటప్పుడు సినిమాని 8 వారాలు హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది” అని మైత్రీ మూవీస్ కి చెందిన చెర్రీ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిగిలిన వాళ్లదీ ఇదే మాట. లాంగ్ రన్ లేనప్పుడు.. 4 వారాలకు ఓటీటీకి ఇచ్చేయడమే బెటర్ అన్నది వాళ్ల ఉద్దేశ్యం.
దీన్ని బట్టి చూస్తే ఓ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే. ఎవరి సినిమా వాళ్లకు ముఖ్యం. థియేటర్ వ్యవస్థ, చిత్రసీమ.. ఇవన్నీ గాలి కబుర్లు. థియేటర్ వ్యవస్థ బాగుపడాలని, ఫుట్ ఫాల్స్ పెరగాలని అందరికీ ఉంటుంది. కానీ.. అందుకోసం త్యాగాలు చేయడానికి మాత్రం సిద్ధపడడం లేదు. నిర్మాతలే 8 వారాల నిబంధనని గాలికి వదిలేస్తే.. ఓటీటీలేం చేస్తాయి? వాళ్ల ఆధిపత్యానికి మరిన్ని రెక్కలు తొడిగినట్టు అవుతుంది. ఇక మీదట ఏ నిర్మాతైనా.. 8 వారాల గడువు గురించి మరోసారి మైకు పట్టుకొని ఘోషిస్తే.. అది పెద్ద జోక్ అనుకొని, మిగిలిన వాళ్లు విరగబడి నవ్వే ప్రమాదం ఉంది. సో.. ఈ నిబంధన గురించి ఇక మాట్లాడుకోకపోవడమే మంచిది.
