దర్శకుడు క్రిష్ పై తెలుగు ప్రేక్షకులకు గట్టి నమ్మకాలు ఉన్నాయి. గమ్యం, వేదం. కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమి పుత్ర శాతకర్ణి.. ఇలా ఆయన సినిమాల వల్ల తెచ్చుకొన్న గౌరవం అది. ఇప్పుడు ‘ఘాటీ’ వస్తోంది. సెస్టెంబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెప్టెంబరు 5న బాక్సాఫీసు దగ్గర కాస్త పోటీ ఉంది. ముఖ్యంగా అనువాద చిత్రాలతో. తమిళ సినిమా `మదరాసీ` ఇదే రోజున వస్తోంది. ‘భాగీ 3’ కూడా విడుదల అవుతోంది. ‘మిరాయ్’ కూడా రావాల్సిందే. కానీ… వాయిదా పడింది. అది ‘ఘాటీ’కి కాస్త ప్లస్ అవ్వొచ్చు.
‘ఘాటీ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అవుట్ పుట్ పై చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. క్రిష్ కథా పరంగా ఎప్పుడూ తప్పు చేయలేదు.. చేయడు. ఈసారి ఘాటీకి అనుష్క రూపంలో ఓ మంచి స్టార్ దొరికింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చూసి చాలా కాలం అయ్యింది. పైగా ఇది ‘స్వీటీకి పుష్ప.. సలార్ రేంజ్ సినిమా’ అని చిత్రబృందం గట్టిగా చెబుతోంది. అనుష్కని ఓ మాస్, యాక్షన్ హీరో రేంజ్ లో చూపించబోతున్న సినిమా ఇది. పాటలు బాగున్నాయి. ట్రైలర్ కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనుష్కని వెండి తెరపై చూసి చాలా కాలం అయ్యింది. సో.. ఎలా చూసినా ఘాటీకి ఇది మంచి తరుణం.
కాకపోతే స్వీటీ ఇప్పుడు పబ్లిసిటీకి రావడం లేదు. మీడియాకు దూరంగా ఉంటుంది. ‘ఘాటీ’ ప్రమోషన్లలో కూడా ఆమె కనిపించదు. ఇదొక్కటే ఘాటీ లోటు. స్వీటీ గైర్హాజరుతో.. ప్రమోషన్ల భారం మొత్తం క్రిష్ పై పడింది. ఎప్పుడూ మాట్లాడని నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా మీడియా ముందుకు వస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. క్రిష్ ఇంటర్వ్యూ పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే క్రిష్ మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఆయన వస్తే… క్లారిటీ తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దాంతో మీడియా అంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తోంది.