‘మీకు మాత్ర‌మే చెబుతా’ ట్రైల‌ర్‌: ఫోన్‌లో ఉన్న ఆ సీక్రెట్ ఏమిటి?

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడ‌ని వాళ్లెవ‌రు..? అది మూడో చేయిగా మారిపోయింది. రోజుకి స‌గ‌టున ఆరు గంట‌లు స్మార్ట్ ఫోన్ల‌తోనే కాపురం చేస్తున్నార‌ని ఓ స‌ర్వేలో తేలింది. అందులో వీడియోలు చూస్తూ కాల‌క్షేపం చేసే వాళ్లే ఎక్కువ‌. ప్ర‌తి ఒక్క‌రి స్మార్ట్ ఫోన్‌లోనూ క‌నీసం ఒక్క ర‌హ‌స్య‌మైనా నిక్షిప్త‌మై ఉంటుంద‌ట‌. అలాంటి ర‌హస్యం దాచుకున్న ఓ స్మార్ట్ ఫోన్ మాయం అయితే, అందులో ఉన్న సీక్రెట్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే.. అప్పుడు ఏం జ‌రిగింది? పెళ్లికి సిద్ఢ‌మైన ఓ ముదురు బ్ర‌హ్మచారి జీవితంలో ఆ స్మార్ట్ ఫోన్ వీడియో ఎలాంటి క‌ల‌క‌లం తీసుకొచ్చింది? – ఈ కాన్సెప్టుతో న‌డిచే క‌థ `మీకు మాత్ర‌మే చెబుతా`. ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్కర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌. ఈరోజు ట్రైల‌ర్ విడుద‌లైంది.

వెన్నెల కిషోర్ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ ట్రైల‌ర్ క‌ట్ చేశారు. త‌న డైలాగ్ మాడ్యులేష‌న్‌తో… స‌ర‌దాగా వాయిస్ ఓవ‌ర్ చెబుతూనే, ఈ చిత్రానికి సంబంధించిన క‌థ‌ని టూకీగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఓ స్మార్ట్ ఫోన్ – అందులోంచి లీకైన వీడియో – ఆ త‌ర‌వాత హీరో అండ్ గ్యాంగ్ ప‌డిన తిప్ప‌లు – ఇదీ ఈ క‌థ‌. కాన్సెప్ట్ కొత్త‌గానే ఉంది. కావ‌ల్సినంత ఫ‌న్ రాబ‌ట్టుకునే స్కోప్ ఉంది. న‌టీన‌టులు కొత్త‌వారే కాబ‌ట్టి , త‌క్కువ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌కు వెళ్లొచ్చు. అది ఈసినిమాకి ప్ల‌స్ పాయింటే. ఏమాత్రం న‌వ్వించినా వ‌ర్క‌వుట్ అయిపోతుంది. న‌టుడిగా త‌రుణ్ భాస్క‌ర్ ఏమి చేయ‌గ‌ల‌డో – ఫ‌ల‌క్ నామా దాస్‌తో తెలిసిపోయింది. ఈ సినిమాలో హీరో త‌నే కాబ‌ట్టి ఇంకాస్త బ‌రువు మోయాల్సివుంటుంది. త‌రుణ్ న‌ట‌న స‌హ‌జంగా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని అక్క‌డ‌క్క‌డ అనుక‌రిస్తున్నాడేమో అనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క‌థ‌కు, స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టే వినిపించింది. భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమా మాత్రం కాద‌ని టేకింగ్‌ని బ‌ట్టి అర్థ‌మైపోతోంది. ఫ‌న్ వర్క‌వుట్ అయితే… నిర్మాత‌గానూ దేవ‌ర‌కొండ‌కు తొలి విజ‌యం ద‌క్కిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.