ప‌వ‌న్ కోసం.. మెగా ఫ్యాన్స్ మీటింగులు

చిరంజీవి ప్ర‌జా రాజ్యం పెట్టిన‌ప్పుడు మెగా అభిమాన సంఘాల‌ది బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా మారింది. ప్ర‌జారాజ్యంకి 18 సీట్లైనా వ‌చ్చాయంటే… అదంతా ఫ్యాన్స్ చ‌ల‌వే. ఇప్పుడు `జ‌న‌సేన‌`కీ ఆ బ‌లం కావాలి. అప్ప‌టితో చిరు ఇమేజ్ తో పోలిస్తే.. ప‌వ‌న్‌కి ఇంకాస్త ఎక్కువ క్రేజ్ ఉంది. అందులో యువ‌త‌రం శాతం ఎక్కువ‌. వాళ్ల ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌లంగా క‌నిపించే అవ‌కాశాలున్నాయి. ఇప్పుడు చిరు అభిమాన సంఘాల ప‌యనం ఎటు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. చిరు ప్ర‌జా రాజ్యం వ‌దిలి కాంగ్రెస్‌లో చేరినా… ఏమాత్రం యాక్టీవ్ గా లేడు. ఆయ‌న ఆపార్టీని ఎప్పుడు వ‌దులుకుందామా అని చూస్తున్నాడు. చిరు వెంట‌నే ఆయ‌న అభిమాన సంఘాలు కూడా. అయితే వాళ్లంతా ఇప్పుడు ప‌వ‌న్ కోసం ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. చిరు అభిమాన సంఘాల నాయ‌కులు ఈ విష‌యంలో ఇప్ప‌టికే ఓ స్ప‌ష్ట‌తకు వ‌చ్చేశారు. గ‌త కొన్ని రోజులుగా ద‌శ‌ల వారీగా ఫ్యాన్స్ మీటింగులు జ‌రుగుతున్నాయి. అభిమాన సంఘాల‌లోని ముఖ్య‌మైన నాయ‌కులు ఈసారి ఎన్నిక‌ల్లో `జ‌న‌సేన‌`కు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని నిర్ణ‌యించుకున్నాయ‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై.. చిరుతో కూడా మాట్లాడేశార‌ని, ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని స‌మాచారం. చిరు అభిమానుల ఓట్లు దండుకోవాల‌న్న ఆశ కూడా ఇప్పుడు కాంగ్రెస్‌కి లేదు. ఎందుకంటే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణ‌లోనూ వాళ్ల‌ది నామ మాత్రమైన పోటీనే. `జ‌న‌సేన‌` పేరుతో ఓట్లు చీలిస్తే ప‌రోక్షంగా చంద్ర‌బాబుని న‌ష్టం చేకూరుతుంద‌ని, ఓ విధంగా అది కూడా త‌మ‌కు ప్ల‌స్ పాయింటే అని కాంగ్రెస్ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ త‌రుణంలో చిరు ఫ్యాన్సే కాదు, సాక్ష్యాత్తూ చిరంజీవినే `జ‌న‌సేన‌`కు స‌పోర్ట్‌గా నిలిచినా వాళ్లు `నో` చెప్ప‌రు. అందుకే.. చిరు ఫ్యాన్స్ జ‌న‌సేన‌కు స‌పోర్ట్ చేయ‌డం దాదాగాపు ఖాయ‌మైంది. ఈరోజు ఫ్యాన్స్ `జ‌న‌సేన‌` జండా ప‌ట్టుకోబోతున్నారు. మ‌రి రేపు చిరు కూడా అదే బాట‌లో న‌డుస్తాడా..? వెయిట్ అండ్ సీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com