కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా.. ప్రభుత్వ స్కూళ్లలోనూ పేరెంట్, టీచర్ మీటింగ్ ను నారా లోకేష్ విద్యా మంత్రి అయిన తర్వాత నిర్వహిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన పేరెంట్, టీచర్ మీటింగ్ కు భారీ స్పందన వచ్చింది. ఈ సారి మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర స్టేక్హోల్డర్ల మధ్య సమన్వయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
మెగా పీటీఎం 2.0లో క్లాసులో విద్యార్థుల పురోగతి, మెరుగుపరచాల్సిన రంగాల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. అలాగే పాఠశాలల విద్యా పనితీరు, మౌలిక సదుపాయాల లోపాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కూడా మాట్లాడతారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, హెల్త్ బుక్లెట్ల పంపిణీ చేస్తారు. అలాగే ఫ్యామిలీ ఫోటో బూత్లు, డ్రీమ్ వాల్స్, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్స్, ఒక చెట్టు-అమ్మ పేరిట వంటి కార్యక్రమాలు కూడా ఉంచారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రజా ప్రతినిధులు. ఈ పీటీఎంకు హాజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జూనియర్ కాలేజీలో జరిగే పీటీఎంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు.