హుక్ స్టెప్స్ అనే మాట ఇప్పుడు వింటున్నాం కానీ.. అసలు దీనికి ఆధ్యుడు తప్పకుండా మెగాస్టార్ చిరంజీవినే. ఒకప్పుడు సినిమాల్లో పాటలు వస్తే, జనం సిగరెట్ కోసం బయటకు వెళ్లిపోయే రోజులు ఉండేవి. దాన్ని మెల్లమెల్లగా మార్చారు చిరంజీవి. పాటల కోసం థియేటర్లకు వెళ్లి, మళ్లీ మళ్లీ టికెట్లు కొనేలా చేశారు. అదంతా చిరు మాయ. ‘ముఠామేస్త్రీ’లో చిరు లయబద్ధంగా వేసిన హుక్ స్టెప్.. ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటికీ దాన్ని ఇమిటేట్ చేయడానికి చూసేవాళ్లెంతో మంది. ‘హిట్లర్’లో అబీబీ… పాటని కళ్లార్పకుండా చూశారు అప్పటి చిరు ఫ్యాన్స్. ఇప్పటికీ ఆ స్టెప్ పై మోజు తీరలేదు. ‘ఇంద్ర’లో వీణ స్టెప్పు.. హుక్ స్టెప్స్ కే బాప్ లాంటిది. చిరు శరీరం మొత్తం స్ప్రింగులా కదిలిన మూమెంట్ అది. ‘ఇంద్ర’లో యాక్షన్ సీన్స్ ని ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేశారో, ఈ ఒక్క మూమెంట్ ని అంతలా ఆస్వాదించారు. ఇలా చిరు వేసిన హుక్ స్టెప్స్ గురించి చెప్పుకొంటూ పోతే.. ఎన్నో పాటల్ని ఉదహరించాల్సి ఉంటుంది.
ఇప్పుడు హుక్ స్టెప్స్ తో ఓ పాటే చేసేశారు మెగాస్టార్. ‘మన శంకర వర ప్రసాద్ గారు’లో.. మంచి డాన్సింగ్ నెంబర్ లా ఈ పాటని కంపోజ్ చేశారు. పాటలో చిరు మరోసారి లయబద్ధంగా కాలు కదిపి, తన గ్రేస్ చూపించుకొన్నారు. గ్రాఫిక్స్ లో అలనాటి.. హుక్ స్టెప్స్ ని మరోసారి తెరపైకి తీసుకురావడం మరింత బాగా కుదిరింది. బాబా సెహగల్ చిరు కోసం పాట పాడి చాలా రోజులైంది. ఈ పాటతో ఆయన ‘రూప్ తేరా మస్తానా’ కాలంలోని అభబిమానుల్ని తీసుకెళ్లిపోయారు. ఈ పాటతో ఫ్యాన్స్ అంతా ఒకప్పటి చిరు డాన్స్ లోని గ్రేస్ని, ఎనర్జిటిక్ మూమెంట్స్ ని గుర్తు చేసుకొంటున్నారు. డాన్సుల్లో ఎవరెంతమంది, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఈ విభాగంలో చిరుని మించిపోయేవాళ్లెవరూ మనకు ఎదురు కాలేదన్న సంగతి ఈ పాట మరోసారి నిరూపించింది.
