వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు త్వరలో సరికొత్త వైభవాన్ని సంతరించుకోనున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి రూ. 1,021 కోట్ల భారీ వ్యయంతో లావీ పేరుతో ఒక అంతర్జాతీయ స్థాయి అల్ట్రా-లగ్జరీ వెల్నెస్ రిసార్ట్‌ను ఇక్కడ నిర్మిస్తున్నారు. 180 విలాసవంతమైన గదులతో రూపొందుతున్న ఈ రిసార్ట్, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ రిసార్ట్‌లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మిచెలిన్ స్టార్ ప్రమాణాలతో కూడిన హై-ఎండ్ రెస్టారెంట్ నిలవనుంది. ప్రపంచ స్థాయి వంటకాలను స్థానిక పర్యాటకులకు పరిచయం చేస్తూ, అత్యున్నత భోజన అనుభవాన్ని అందించేలా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దుతున్నారు. వికారాబాద్ పరిసరాల్లో ఇంతటి భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న మొదటి లగ్జరీ ప్రాజెక్ట్ ఇదే మొదటిది.
కేవలం లావీ మాత్రమే కాకుండా, అనంతగిరి టూరిజం సర్క్యూట్ వెంబడి మరిన్ని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అనంతగిరిని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ. 2,950 కోట్ల భారీ పర్యాటక హబ్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎకో-టూరిజం, వెల్నెస్ సెంటర్లు , ఫారెస్ట్ వ్యూ విల్లాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ విలాసవంతమైన ప్రాజెక్టుల రాకతో వికారాబాద్ పర్యాటక రంగం రూపురేఖలు మారిపోనున్నాయి. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో చోటు సంపాదించుకోనుంది. అనంతగిరి అందాలకు ఈ లగ్జరీ హంగులు తోడైతే, ఇది దక్షిణ భారత దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదు.
