తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అపచారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, ఒక సీనియర్ మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు తాను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ముంబైలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదం అత్యంత పవిత్రమైనదని, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు దేవుడి ఆశీర్వాదంతో సమానమని లోకేష్ పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన కల్తీ వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాము అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రస్తుతం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా, రాష్ట్రం తరపున క్షమాపణలు చెప్పడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా భక్తులకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపం ప్రకటించడం నైతిక విలువలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను వ్యక్తిగతంగా అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తానని లోకేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా అక్కడి పద్ధతులనే పాటిస్తానని, తోటి మనుషులను గౌరవించడమే తన సిద్ధాంతమని చెప్పారు. రాజకీయాల కంటే ప్రజల నమ్మకం, నైతికత ముఖ్యమని నమ్ముతానన్నారు. గత పాలకుల చర్యల వల్ల పవిత్రమైన ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని లోకేష్ వివరించారు. తిరుమలలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి నాణ్యత పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు అందించే ప్రసాదం స్వచ్ఛత విషయంలో ఇకపై రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ దిశగా ఇప్పటికే పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు ఆయన భరోసా ఇచ్చారు.