ఒక త్యాగం మంత్రి పదవి కంటె విలువైనది!

ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవికి వచ్చిన ఏ రాజకీయ ఆశావాదికైనా తదుపరి లక్ష్యం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా మంత్రి పదవిని అలంకరించడం మీదనే దృష్టి ఉంటుంది. ముఖ్యమంత్రి కావాలనే కల కేవలం కొందరికి మాత్రమే పరిమితం అయిన వ్యవహారం గనుక.. ఎమ్మెల్యే పదవిలోకి వచ్చిన ప్రతివాళ్లూ, కులం ప్రాంతం తదితర ఏదో ఒక కోటాలో మంత్రి పదవిని దక్కించుకుంటే చాలునని ఆశిస్తుంటారు. అయితే ఉన్న పదవిని కూడా ఊడగొట్టుకునే వారు ఎవరుంటారు? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అలా కూడా జరుగుతుంది. ఉన్నది ఊడగొట్టుకోవడానికి మించిన అదృష్టం మరొకటి ఉండదు అనే విచిత్రమైన పరిస్థితి కూడా దాపురిస్తుంది. ఇప్పుడు తెలుగునాట ఏపీ రాజకీయాల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. నారా లోకేష్‌ను మంత్రిని చేయడానికి చంద్రబాబునాయుడు సంకల్పిస్తున్నాడనే పుకార్లు రాగనే.. తెలుగు తమ్ముళ్లకు ఉత్సాహం పొంగివవచ్చినట్లుంది. తాము రాజీనామా చేస్తాం అంటే.. తాము రాజీనామా చేస్తాం అంటూ.. తమ సీట్లలో లోకేష్‌ ను రంగంలోకి దించమంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. లోకేష్‌ బాబును ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకు మించిన సదవకాశం మరొకటి ఉండదని అందరూ ఉవ్విళ్లూరుతున్నారు.

బాబు గారి కొడుకును ప్రసన్నం చేసుకోవడం కంటె రాజకీయంగా తమ జీవితానికి మరో లక్ష్యాలు అనవసరం అని అనేకమంది ఫిక్సయిపోయినట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు ఇటీవలే ఎమ్మెల్సీ అయి ప్రస్తుతం మంత్రి పదవి కోసం చాలా తీవ్రంగా నిరీక్షిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ లోకేష్‌ను మంత్రి చేయాలనుకుంటున్న చంద్రబాబు నిర్ణయం భేష్‌ అంటూ కితాబివ్వడం వరకూ పరిమితం అయిన వైనం పాఠకులకు తెలుసు. అయితే ఇటీవలే చాలా పోరాడి మరీ ఎమ్మెల్సీ టిక్కెట్‌ సాధించుకుని పదవిలోకి వచ్చిన బెజవాడ నేత బుద్ధా వెంకన్న ఇంకో అడుగు ముందుకు వేసాడు. లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి కేబినెట్‌లోకి తీసుకోవడానికి వీలుగా తాను తక్షణం తన పదవికి రాజీనామా చేస్తా అంటూ బహిరంగ ప్రకటన చేసేశాడు. బుధవారమే చంద్రబాబును కలిసి రాజీనామా లేఖ ఇచ్చేస్తా అని వెల్లడించాడు.

అయితే బుద్ధా వెంకన్న బయటపడ్డాడు. లోలోన ఇదే ఆఫర్‌తో లోకేష్‌ను ఆశ్రయించి.. తమ నియోజకవర్గాల్లో బరిలోకి దిగమంటూ విన్నవించుకుంటున్న వారు ఇంకా అనేకమంది ఉన్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. వెధవది మంత్రిపదవి లాంటిది వస్తే ఎంత? పోతే ఎంత? అదే లోకేష్‌ బాబును ప్రసన్నం చేసుకుంటే.. బోలెడు మంత్రి పదవులకు సరిపడా రాజకీయ భవిష్యత్తు, ఆర్జనలకు సంబంధించి భరోసా దక్కినట్లే అని ఎవరికి వారు వ్యూహాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి ఎవరి యత్నాలు ఫలిస్తాయో.. తాను హైదరాబాదీని అని చెప్పుకునే ఈ కుర్రవాడు.. ఏ గడ్డమీదనుంచి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ముచ్చటచూపిస్తాడో గమనించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com