గత వారం బాక్సాఫీసు దగ్గరకు మూడు సినిమాలొచ్చాయి. వాటిలో ‘లిటిల్ హార్ట్స్’కు మంచి విజయం దక్కింది. చిన్న సినిమా అయినా… మంచి వసూళ్లు దక్కించుకొంటోంది. ఈ విజయం టాలీవుడ్ కి కొత్త ఉత్సాహం వచ్చినట్టైంది. ఈవారం రాబోయే చిత్రాలకూ లిటిల్ హార్ట్స్ బూస్టప్ ఇచ్చినట్టైంది.
ఈవారం కిష్కిందపురి, మిరాయ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. రెండూ రెండు విభిన్న ప్రపంచాల్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లబోతున్నాయి. మిరాయ్ తో చిత్రబృందం ఓ ఫాంటసీ వరల్డ్ సృష్టించింది. అశోకుడి కథకీ, రామాయణానికీ లింకు ఏమిటన్న ఆసక్తి మిరాయ్ ట్రైలర్ తో కలిగించింది. తేజా సజ్జా నుంచి వస్తున్న సినిమా ఇది. హనుమాన్ తో తాను సూపర్ హీరో అయిపోయాడు. మిరాయ్ పై కూడా నిర్మాత విశ్వ ప్రసాద్ భారీగా ఖర్చు పెట్టారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. 40 కోట్లు ఓటీటీ, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. మిగిలిన మొత్తం రాబట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనోజ్ విలన్ పాత్రలో కనిపించడం, చివర్లో రాముడి ఎంట్రీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు కానున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హారర్ చిత్రం.. ‘కిష్కిందపురి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా కూడా ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. విరూపాక్ష తరవాత ఈ జోనర్ లో వస్తున్న సినిమా కావడం, ట్రైలర్ లో అనుపమ గెటప్ ఇవన్నీ ఆసక్తి రెట్టింపు చేశాయి. హారర్ జోనర్‌కు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి తీసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ ఈ జోనర్ ని ఎవరూ టచ్ చేయలేదని చిత్రబృందం చెబుతోంది. హారర్ సినిమాలకు ఫ్యాన్ బేస్ వుంది. వాళ్లకు ఈ సినిమా నచ్చితే.. కమర్షియల్ గా హిట్ అవ్వడం గ్యారెంటీ. ఈ సినిమా బడ్జెట్, జరిగిన మార్కెట్ బేరీజు వేసుకొంటే నిర్మాతలు సేఫ్ జోన్లో ఉన్నట్టు అర్థం అవుతోంది. ఈ రెండు చిత్రాలకూ ప్రీమియర్లు ముందే పడే ఛాన్స్ వుంది, ఏ సినిమాకు టాక్ బాగుంటే, ఆ సినిమా మంచి ఎడ్జ్ తీసుకొంటుంది. లిటిల్ హార్ట్స్ ఊపులో ఉన్న టాలీవుడ్ ఈ జోరు ఈ వారం కూడా కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయి.