Mirai Movie Review
రేటింగ్: 3.25/5
ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించే సినిమా ఇవ్వడం కష్టంగా మారిపోయింది. ‘వావ్’ ఫాక్టర్ లేకపోతే జనం రావడం లేదు. సూపర్ హీరో-ఫాంటసీ జానర్‌కి జనాన్ని థియేటర్స్‌కి తీసుకువచ్చే సత్తా ఉంది. తేజ సజ్జా హనుమాన్తో మంచి విజయాన్ని రుచి చూశాడు. ఇప్పుడు ‘మిరాయ్’తో వచ్చాడు. మిరాయ్ కేవలం ఫాంటసీ సూపర్ హీరో జానర్ మాత్రమే కాదు.. యాక్షన్, అడ్వెంచర్, సూపర్ నేచురల్, ఇతిహాసాలు, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్స్.. ఇలా బోలెడు కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఒక జంబో ప్యాక్‌లా రెడీ చేశారు. మరీ ఎలిమెంట్స్ మేళవింపు ఎలా ఉంది? ఆడియన్స్‌కి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
అశోకుడు తొమ్మిది రహస్య గ్రంథాల రక్షణని తొమ్మిది మంది యోధులకి అప్పగిస్తాడు. ఆ తొమ్మిది గ్రంథాలు సొంతం చేసుకొని అమరత్వం పొంది ప్రపంచాన్ని పీడించాలనేది లామా(మంచు మనోజ్) లక్ష్యం. తొమ్మిది గ్రంథాలు లామా చేతికి వస్తే ప్రపంచం నాశనం అవుతుంది. ఈ విపత్తు నుంచి కాపాడే శక్తి మిరాయ్ అనే ఆయుధానికి ఉంది. కట్ చేస్తే.. హైదరాబాద్‌లో స్క్రాప్ బిజినెస్ చేసుకునే 24 ఏళ్ల కుర్రాడు వేద ప్రజాపతి (తేజ సజ్జా)కి మిరాయ్కి ఉన్న సంబంధం ఏమిటి? మిరాయ్ కోసం వేద ఎలాంటి ప్రయాణం చేశాడు? లామాని ఎలా అడ్డుకున్నాడనేది మిగతా కథ.
హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న సినిమా అనే మాట తప్పితే.. మిరాయ్పై చాలామందిలో చాలా సందేహాలు. దర్శకుడు, డీవోపీ కార్తిక్ ఘట్టమనేని ‘ఈగిల్’తో చాలా నిరాశ పరిచాడు. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈగిల్‌కి ముందు తర్వాత వరుస ఫ్లాపులే. మిరాయ్ ట్రైలర్లో విజువల్స్ అబ్బురపరిచినప్పటికీ.. దర్శకుడిగా కార్తిక్ థియేటర్లో ఆడియన్స్ పల్స్ పట్టగలడా? అనే సందేహం. అయితే అనుమాలన్నీ పటాపంచలు చేస్తూ.. మిరాయ్తో ఆడియన్స్ థియేటర్లో చూడదగ్గ సినిమా ఇవ్వడంలో కార్తిక్ పైచేయి సాధించాడు.
కథగా చూసుకుంటే చాలా ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. కానీ కార్తిక్ మిరాయ్‌ని మొదలుపెట్టిన విధానం.. ఒక చందమామ కథలా మరో పేజీ తిప్పాలనిపించేలా ఆసక్తికరంగా ఉంటుంది. తల్లి, దైవం ఎప్పుడూ కూడా పెద్ద కమర్షియల్ ఎలిమెంట్స్. కేజీఎఫ్‌లో రాకీకి ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయిపోవడానికి కారణం అమ్మ. మిరాయ్ కూడా ఒక అమ్మ కథే. సినిమా నడుస్తున్నకొద్దీ ఆ ఎమోషన్ని ఆడియన్స్‌కి బలంగా పట్టించగలిగారు. ఈ కథలో మరో సూపర్ ఎమోషన్ డివోషన్. సూపర్ హీరోని డామినేట్ చేస్తూ ఆ ఎమోషన్ పేలింది. కార్తిక్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా అన్ని థీమ్స్ ప్లే చేశాడు.
కథ నేరుగా తొమ్మిది రహస్య గ్రంథాలతో మొదలౌతుంది. వరల్డ్ బిల్డింగ్ కోసం కావాల్సినంత సమయం తీసుకున్నప్పటికీ క్రియేట్ చేసిన వరల్డ్‌లో ఆడియన్స్‌ని లీనం చేయగలిగారు. తేజ సజ్జా ఎంట్రీ మాత్రం కాస్త రొటీన్‌గానే ఉంటుంది. బహుశా వేద క్యారెక్టర్ని లో-ప్రొఫైల్‌లో ఉంచడమే ఉద్దేశం కావచ్చు. జగదేక వీరుడు అతిలోక సుందరి స్ఫూర్తితో కొన్ని సీన్లు నడిపారు. హిమాలయాల నుంచి వచ్చిన విభా(రితిక), వేద గతం గురించి చెప్పడం, తన శక్తులను గుర్తు చేయడం, అలాగే వారిని పరిశీలించే ఒక పోలీస్ గ్రూప్.. వీటిచుట్టూ నడిపిన సన్నివేశాలు ఓ మోస్తరుగా ఉంటాయి. లామా పాత్రలో వచ్చే యాక్షన్ మాత్రం పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇంటర్వెల్లో పక్షితో చేసే ఓ పోరాటం సెకండ్ హాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఆసక్తికరంగా మొదలౌతుంది. మిరాయ్ చేతికి వచ్చిన తర్వాత దాని మహత్తును తెలుసుకునే క్రమంలో శ్రీరాముని నేపథ్యం కథలో ఇమడ్చడంతో గొప్ప క్లైమాక్స్‌కి పునాది వేయగలిగారు.
అయితే క్లైమాక్స్‌కి చేరుకోవడానికి ముందు కథలో వేగం కొంత మందగించింది. సెకండ్ హాఫ్ కోసం రెండు ఫ్లాష్‌బ్యాక్‌లు దాచుకున్నారు. మనోజ్, శ్రీయ పాత్రల బ్యాక్ స్టోరీలు కావాల్సినదానికంటే ఎక్కువ సమయం తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆ లోటును భర్తీ చేస్తూ క్లైమాక్స్‌ని గూజ్బంప్స్ ఎలివేషన్‌తో నిలబెట్టారు.
తేజ సజ్జా పాత్రని రాసుకోవడం దర్శకుడు చాలా తెలివిగా ఆలోచించాడు. దేవుడే నడిపించే పాత్ర అది. అయితే తన యాక్షన్ ఎక్కడ కూడా ఓవర్‌డోస్ అవ్వదు. తను ఓడిపోయిన క్షణాల్లో ఓ అతీత శక్తి వచ్చి తనని నిలబెడుతున్న తీరు చాలా సహజంగా కుదిరింది. మనోజ్‌కి సరైన పాత్ర పడింది. ఆ పాత్రకు న్యాయం చేశాడు. నిజానికి చివరివరకూ తనదే డామినేషన్. శ్రీయ శరణ్‌కి బలమైన పాత్ర దక్కింది. ఇందులో మదర్ ఎమోషన్ బలంగా పండింది. అంబిక పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది. విభా పాత్రలో రితికా నాయక్ కనిపించిన తీరు రెగ్యులర్ హీరోయిన్స్‌కి భిన్నంగా కొత్తగా అనిపించింది. తన పాత్రకు కూడా ఒక అతీతశక్తి ఉంది. జగపతిబాబు, జయరాం తమ అనుభవం చూపించారు. గెటప్ సీన్ చెప్పే డైలాగులు కొన్ని నవ్విస్తాయి. దర్శకులు కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా చేసిన పోలీసు పాత్రలు ఇందులో సర్ప్రైజ్.
గౌరహర మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతిసీన్కి వందశాతం న్యాయం చేశాడు, తన స్కోర్‌తో సినిమా స్కోర్ పెంచాడు. విజువల్స్ ఎఫెక్ట్స్ బాగా కుదిరాయి. ముఖ్యంగా పక్షి సీక్వెన్స్ భలే వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతంగా చేసుకున్న సిజీ వర్క్ ఇది. నిర్మాత విశ్వ ప్రసాద్ ఇక గ్రాఫిక్స్‌కి స్కోప్ ఉండే పెద్ద సినిమాలకి కూడా సర్వీస్‌ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంత మంచి క్వాలిటీతో వచ్చాయి గ్రాఫిక్స్. కథకు అనుగుణంగా మాటలు వినిపించాయి.
కార్తికేయ 2కి డీవోపీగా పని చేసిన అనుభవం ఏమో కానీ దర్శకుడు కార్తిక్ నిజంగా సర్ప్రైజ్ చేశాడు. ఫ్యామిలీతో కలసి థియేటర్స్‌లో ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇచ్చాడు. చాలా కాలంగా ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్న పీపుల్ మీడియా ఫాక్టరీ మిరాయ్ తో కంబ్యాక్ ఇచ్చేసినట్లే.
రేటింగ్: 3.25/5


