క‌డుపు మండిన మిర్చి రైతుది త‌ప్పా కేసీఆర్ దొర‌గారూ!

ఈ లోకంలో రైతులంటేనే ప్ర‌భుత్వాల‌కు లోకువ‌య్యింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అంతంటారు.. ఇంతంటారు.. మీ క‌ష్టాలు మా క‌ష్టాల‌తో స‌మాన‌మంటారు. అర‌చేతిలో స్వ‌ర్గం చూపిస్తారు. ఎన్నిక‌లైపోయిన త‌ర‌వాత వారెవ‌రో వీరెవ‌రో. రైతుకు రాయితీలివ్వ‌డం, స‌క్ర‌మంగా విద్యుత్తు స‌ర‌ఫ‌రా చేస్తే స‌రిపోతుందా. వారికి స‌రైన మ‌ద్ద‌తు ధ‌ర అందేలా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి లేదా. ఇలా ప్ర‌శ్నిస్తే.. ప్ర‌శ్నించిన వారు రైతులే కాదంటారా. అందుకు ఆధారాలున్నాయంటారా.
తాజాగా ఖ‌మ్మం జిల్లాలో మిర్చి పంట‌పై రైతులు చేస్తున్న ఆందోళ‌న‌నుద్దేశించి గౌర‌వ‌నీయులైన తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావుగారు అన్న మాట‌లివి. అక్క‌డ జ‌రిగిందేమోటో ఆయ‌న నిశితంగా ప‌రిశీలించారా. రైతులు ఆందోళ‌న ఎందుకు చేస్తున్నారో.. అందుకు సంబంధించిన వాస్త‌వాలేమిటో.. ఆయ‌న‌కు తెలుసా. నిజ‌మే ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తికి అన్ని అంశాల‌నూ స్వ‌యంగా ప‌రిశీలించే అవ‌కాశ‌ముండ‌దు. అలాగ‌ని.. స‌రైన స‌మాచారం అందుతోందో లేదో అనే విష‌యాన్ని రూఢీ చేసుకోవ‌డానికి కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌ను కేసీఆర్ గారు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. మిర్చి రైతులు స‌రైన మ‌ద్ద‌తు ధ‌ర రాక‌, ద‌ళారీలు కుమ్మ‌క్క‌యి పోయి రోడ్డుమీద త‌మ పంట‌ను అమ్ముకుంటుంటే వారికి క‌ళ్ళ‌ల్లో మంట‌లు రేగాయి. రైతుల్ని రెచ్చ‌గొట్టారు. ప‌డిన క‌ష్టం క‌ళ్ళ‌ముందు క‌నిపించ‌డంతో రైతులు స‌హ‌నాన్ని కోల్పోయారు. మిర్చి యార్డు కార్యాల‌యంపై దాడికి దిగారు. ప్ర‌భుత్వం త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకోవ‌డానికి మార్గాలు వెతికింది. దీనికి రాజ‌కీయ రంగును అంట‌గ‌ట్టింది. దీనివెనుక ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని స‌హించ‌లేని ప్ర‌తిప‌క్షాలున్నాయంది. అవే ప‌లుకులు కేసీఆర్ గారి నోటి వెంటా వ‌చ్చాయి. ఆధారాలుంటే చ‌ర్య‌లెందుకు తీసుకోలేదు? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. స్ప‌ష్టంగా ఆధారాలు క‌నిపించిన కేసుల్లోనూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌నూ, త‌మ ప‌బ్బాన్నీ గ‌డుపుకోవ‌డానికి ఎటువంటి క్రీడ‌కు దిగిందీ అంద‌రికీ తెలుసు.

ఏ ప్ర‌భుత్వానికైనా స‌రే రైతును నిందించే హ‌క్కు లేదు. భూమిని దున్ని.. స్వేదం చిందించి.. పంట పండించే రైతుకు ఆ భూమాత‌కున్నంత స‌హ‌న‌మూ ఉంద‌ని ప్ర‌భుత్వాలు తెలుసుకోవాలి. ఒక‌వేళ రైతుది త‌ప్పున్నా స‌రే.. సంయ‌మ‌నం పాటించాలి. చరిత్రలో ఇంత‌వ‌ర‌కూ రైతును నిందించిన సంద‌ర్భాలు కేవ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్‌లోనూ.. విడిపోయిన త‌ర‌వాత తెలంగాణ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయి. మాస్ హిస్టీరియా వ‌ల్ల రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మంటే.. రాజ‌కీయ ప్రేరితంగా రైతులు గొడ‌వ చేస్తున్నార‌ని కేసీఆర్ స‌ర్కారంటోంది. నిన్న కాక మొన్న సుప్రీంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రైతుల ఆందోళ‌న‌కు వ్య‌తిరేకంగా వేసిన అఫిడ‌విట్‌నూ చూశాం. రైతే లేక‌పోతే మ‌న‌కు తిండిగింజ‌లెలా వ‌స్తాయ‌న్న ఇంగితం కొర‌వ‌డుతోంది. సంపాదించే డ‌బ్బు తిని బ‌త‌క‌గ‌ల‌మా. ప్ర‌భుత్వాల తీరును కేంద్రం సునిశితంగా గ‌మ‌నించాలి. రైతు కంట క‌న్నీరొల‌కకుండా చూడాలి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.