కొసరు కేబినెట్ భేటీ..! ఇంత సమన్వయలోపమా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వరుసగా రెండో రోజు సమావేశం జరగనుంది. అయితే.. ఇది అత్యవసర బిల్లులు ఆమోదించడానికో.. లేక ఇంకో అత్యవసర నిర్ణయమో తీసుకోవడానికో కాదు.. తొలి రోజు కేబినెట్ భేటీలో చర్చించలేక… మిగిలిపోయిన అంశాలను చర్చించడానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశం. మొదటి రోజు ఎందుకు చర్చించలేకపోయారంటే.. సమయం సరిపోలేదు. అంతగా… సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగిందా… అంటే అదీ లేదు. గంటలోపే ముగిసింది. మరో వైపు.. కేబినెట్ సమావేశం పేరుతో… గురువారం ఉదయం.. అసెంబ్లీ సమావేశాలను.. కూడా ప్రారంభించిన వెంటనే వాయిదా వేశారు. అసలేం జరుగుతుందో.. అని అటు అధికారులు.. ఇటు శాససనభ్యులు.. తెలుసుకునేందుకు తంటాలు పడ్డారు. చివరికి మాత్రం.. అసలు అధికారులు, ప్రభుత్వానికి మధ్యం సమన్వయం లేదని తేలిపోయింది. కనీసం.. ఏం జరుగుతుందో.. ఫాలో అప్ కూడా లేదని తేలిపోయింది.

గురువారం ఉదయం 9గంటలకు అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉంది. అదే సమయంలో 8 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంటలో.. కేబినెట్ భేటీ ముగించి.. కీలక నిర్ణయాలు తీసుకుని… మంత్రులంతా అసెంబ్లీకి వెళ్లాలని అనుకున్నారు. మొత్తం పదిహేడు అంశాలు కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి. ఒక్కో దానికి ఐదు నిమిషాలు కేటాయించి నిర్ణయం తీసుకున్నా… సమయం సరిపోదు. పరిస్థితి ఇలా ఉంటే.. జగన్మోహన్ రెడ్డి… కేబినెట్ భేటీకి ఇరవై నిమిషాలకుపైగా ఆలస్యంగా వచ్చారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాల్సినవి.. నాలుగు అంశాలేనని.. సీఎం అనుకున్నారని… అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే 17 ున్నాయని సీఎస్ చెప్పడంతో.. హడావుడిగా 12 అంశాలకు ఆమోదం తెలిపి కేబినెట్ సమావేశాన్ని ముగించారు. అప్పటికే.. అసెంబ్లీ ప్రారంభమై.. మంత్రులు లేకపోవడంతో.. వెంటనే.. స్పీకర్ వాయిదా వేశారు.

కేబినెట్ భేటీ జరుగుతున్న కారణంగా… ప్రారంభమైన అసెంబ్లీని నిమిషాల్లోనే వాయిదా వేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వం ఇంత సమన్వయ లోపంతో ఉంటుందని విపక్షం కూడా అనుకోలేదు. శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వ చీఫ్ విప్ అందర్నీ సమన్వయ పరిచేలా విధులను నిర్వహించాల్సి ఉందని.. కానీ శ్రీకాంత్ రెడ్డి పట్టించుకోలేదని వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ సమావేశం జరుగుతున్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తే ఏ సమస్యా ఉండేదికాదన్నారు. కానీ… జరగాల్సింది జరిగిపోయింది. అనుభవ లేమితో ప్రభుత్వం నవ్వుల పాలయిందని.. టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ పరిస్థితి సీఎంను కూడా ఇబ్బంది పెట్టింది. అందుకే భవిష్యత్తులో ఉదయం సమయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయొద్దని సీఎస్‌ను ఆదేశించారు. మిగిలిపోయిన అంశాలను శుక్రవారం కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఆమోదిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com