ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ హయాంలో నమోదైన తప్పుడు కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో దర్యాప్తు సంస్థలు మూసివేస్తున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాము హైకోర్టుకు వెళ్తామని.. తాము వచ్చాక మళ్లీ కేసులు తెరుస్తామని వైసీపీ నేతుల మీడియా ముందుకు వచ్చి జబ్బలు చరుస్తున్నారు. ఇలా అరిచే బదులు హైకోర్టుకు పోవచ్చు కదా అన్ని సందేహం అందరికీ ఉంది. కానీ వారు చేయలేరు కాబట్టే రంకేలేస్తున్నారు. ఆ కేసుల్ని ఇంకెప్పటికీ తెరవలేరు కూడా.
మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏమిటి?
సాధారణంగా ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత, సదరు కేసులో నిందితుడిపై మోపిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని లేదా ఆ ఫిర్యాదులోని అంశాలు వాస్తవ విరుద్ధమని దర్యాప్తు అధికారి భావిస్తే, ఆ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పరిగణిస్తారు. అంటే, వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల లేదా తప్పుడు సమాచారం వల్ల ఈ కేసు నమోదైందని అర్థం. దీనిని న్యాయభాషలో బి-రిపోర్ట్ అని కూడా అంటారు. ఈ రిపోర్టును దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పిస్తుంది. కోర్టు దీనిని ఆమోదిస్తే ఆ కేసు పూర్తిగా కొట్టివేసినట్లు లెక్క. ఇప్పుడు చంద్రబాబు కేసుల్లో అదే జరుగుతోంది.
పైకోర్టుల్లో సవాల్ చేయవచ్చా?
దర్యాప్తు సంస్థ సమర్పించిన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ నివేదికను సవాల్ చేసే అవకాశం చట్టంలో ఉంది. ఈ కేసులో ఎవరైతే బాధితులు ఉంటారో, వారు కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. దర్యాప్తు అధికారి కావాలనే నిందితులకు కొమ్ముకాస్తున్నారని, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని బాధితులు కోర్టును కోరవచ్చు. మెజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరిస్తే, బాధితులు హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి, కేసును పునర్విచారణ చేయాలని లేదా మరో సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరవచ్చు. కానీ చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు కేసుల క్లోజర్ కు పిటిషన్లు వేస్తున్నారు. మళ్లీ కేసులు తెరవాలని వాళ్లు పిటిషన్లు వేయలేరు. వేసినా చెల్లవు.
ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ కేసులను తెరవొచ్చా?
చట్టపరంగా ఒకసారి కోర్టు కేసును మూసివేసిన తర్వాత అదే అంశంపై మళ్లీ విచారణ జరపడం సంక్లిష్టమైన ప్రక్రియ. అయితే, గతంలో జరిగిన దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని లేదా కీలకమైన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని కొత్త ప్రభుత్వం భావిస్తే, కోర్టు అనుమతితో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోరవచ్చు. కానీ, కేవలం రాజకీయ కారణాలతో ఒకసారి మూసివేసిన కేసును మళ్లీ తెరవడం న్యాయస్థానాల్లో నిలబడటం కష్టం. కొత్త సాక్ష్యాధారాలు లభ్యమైతే తప్ప, మూసివేసిన కేసును తిరిగి తెరవడానికి న్యాయమూర్తులు సుముఖంగా ఉండరు.
