mithra mandali movie review
Telugu360 Rating: 1.5/5
‘మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడానికే’ అంటాడు ఓ సుప్రసిద్ధ హాస్య నటుడు. నిజమే… నవ్వడం ఈజీ. నవ్వించడం చాలా కష్టం. స్వచ్ఛమైన నవ్వులు పుట్టించడం మహా మహా కష్టం. ‘ఇది కామెడీ సినిమారా..’ అని లైట్ తీసుకొంటాం కానీ, ఆ కామెడీ కోసం రచయితలు, దర్శకులు, నటీనటులు నానా పాట్లూ పడుతుంటారు. నవ్వుకు టైమింగ్ చాలా ముఖ్యం. రైటింగ్ ఇంకా ముఖ్యం. ఇవి రెండూ కుదిరినా కామెడీ పండించే స్కిల్ నటీనటులకు ఉండాలి. ఇవన్నీ సమపాళ్లల్లో మేళవించినప్పుడే వినోదం పండుతుంది. నవ్వులు వర్కవుట్ అయితే మాత్రం థియేటర్లు ఘొల్లుమంటాయి… జాతిరత్నాలు సినిమాలా. ఆ సినిమా వచ్చాక.. నవ్వించే తీరులో చాలా మార్పులొచ్చాయి. రైటింగ్ స్టైల్ కూడా మారింది. ‘మిత్రమండలి’ టీజర్, ట్రైలర్ చూస్తే ‘ఇదేదో జాతిరత్నాలు స్కూల్’ అనిపించడం సర్వ సాధారణం. పైగా ఒక జాతిరత్నం ప్రియదర్శి ఇందులో హీరో. దానికి తోడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. తన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. నిర్మాత బన్నీ వాస్ ఈ సినిమా గురించి ప్రతీ సందర్భంలోనూ గొప్పగా చెప్పారు. దీపావళికి నవ్వుల పటాసు వెలిగిస్తా అన్నారు. మరి… ఈ నవ్వుల బాంబు ఏమైంది? జాతిరత్నాలు స్కూల్ నుంచి వచ్చిన సినిమాలో సిలబస్ ఏముంది? నవ్వులు పండాయా, లేదా?
కులం పిచ్చి బాగా ముదిరి, ఆ ఏరియా ఎం.ఎల్. సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న నారాయణ (వీటీ గణేశణ్)కి అనుకోని షాక్ తగులుతుంది. తన కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఎవరినో ప్రేమించి, ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోతుంది. ఈ విషయం బయటకు చెబితే తన పరువు పోతుందని భావించి.. ఎస్.ఐ సాగర్ (వెన్నెల కిషోర్)ని ఆశ్రయిస్తాడు నారాయణ. తన కూతుర్ని ఎలాగైనా తీసుకొచ్చి, తన పరువు కాపాడాలని ప్రాధేయ పడతాడు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ద్వారా స్వేచ్ఛ మిస్సింగ్ వెనుక నలుగురు మిత్రుల (ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు, ప్రశాంత్ బెరహా) ఉన్నారన్న విషయం తెలుస్తుంది. ఈ నలుగురూ ఉట్టి ఆవారా గాళ్లు. ఆ ఊర్లో పనీ పాటా లేకుండా తిరిగే జులాయి బ్యాచ్. వీళ్లకూ.. స్వేచ్ఛకూ ఉన్న సంబంధం ఏమిటి? స్వేచ్ఛ తప్పిపోయిందా, పారిపోయిందా, లేదంటే లేచి పోయిందా? సాగర్ వీళ్లని పట్టుకొన్నాడా, లేదా? అనేదే మిగిలిన కథ.
‘ఇదో కథ లేని కథ..’ అంటూ ఇంట్రోలో వాయిస్ ఓవర్ లోనే చెప్పేశాడు దర్శకుడు. దాంతో ఈ కథ లేని కథలో ఎంత కథ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. నిజానికి కామెడీ సినిమాల్లో కథలది చిన్న పీటే. వినోదానికే పెద్ద సోఫా వేయాలి. కొత్తదనం అనేది కథలో లేకపోయినా, కామెడీలో ఉంటే సరిపోతుంది. కాకపోతే.. కథతో కూడిన కామెడీనే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. గతంలో జంధ్యాల, ఆ మధ్యలో ఈవీవీ సత్యనారాయణ సినిమాలన్నీ కామెడీలతో సాగేపోయేవి. కానీ ఆ కామెడీ సినిమాల్లోనూ కథ అనే వస్తువు బలంగానే ఉండేది. అందుకే ఆయా సినిమాలు నిలిచిపోయాయి. ట్రెండ్ సెట్టర్ `జాతిరత్నాలు`లో కూడా కాస్తో కూస్తో కథ ఉంటుంది. కాబట్టే కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ఆ పాత్రలూ గుర్తిండిపోయాయి. అయితే ఈ మిత్ర మండలి సినిమాలో కథ ఆవగింజంత కూడా కనిపించదు. కనీసం కామెడీ వర్కవుట్ అయ్యిందా అంటే అదీ లేదు. అంతా బలవంతపు హాస్యమే.
‘నేను కామెడీ రాస్తున్నా’ అని రచయిత…
‘నేను కామెడీ తీస్తున్నా’ అని దర్శకుడు…
‘మేము కామెడీ చేస్తున్నాం’ అని నటీనటులు అనుకొంటే ఏమాత్రం సరిపోదు. రాతలో, తీతలో, చేతలో కామెడీ ఉండాలి. లేదంటే తెరపై కామెడీ పలకడం అటుంచి.. సినిమానే ‘కామెడీ పీస్’ అయిపోతుంది. అందుకు ‘మిత్రమండలి’ ఓ తాజా ఉదాహరణ. ఈ సినిమా నిండా హస్య నటులు కావాల్సినంతమంది ఉన్నారు. అందరూ నవ్వించడంలో ఆరి తేరిన వాళ్లే. దర్శకుడు కూడా కామెడీ లాంటిదేదో రాశాడు. కానీ.. కామెడీ మాత్రం పుట్టించలేకపోయాడు. దానికి కారణం.. రాతలో, తీతలో వైఫల్యమే. సీన్ నెంబర్ వన్ నుంచి ప్రతీ క్యారెక్టరూ అతి చేస్తుంటుంది. అందరూ అరచి మాట్లాడుతుంటారు. ఈ ఓవర్ ది బోర్డ్ విన్యాసాల్లోంచి కామెడీ పుడుతుందని దర్శకుడు ఎలా అనుకొన్నాడో అనిపిస్తుంది. బంతి లేకుండా క్రికెట్ ఆడడం చూడ్డానికి బాగుంటుంది. కానీ రైటింగ్ లో బలం లేకుండా కామెడీ పుట్టించాలనుకోవడం మాత్రం మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుంది. సీన్ బై సీన్ సాగిన విధానం, ఆ సీన్లు చూశాక మనల్ని ఆవహించిన నీరసం, అందులోంచి పుట్టిన జ్ఞానోదయం ఇవన్నీ గమనిస్తే.. అసలు దర్శకుడు స్క్రిప్ట్ అనేది రాశాడా, లేదంటే సెట్లో నలుగురు ఆర్టిస్టుల మధ్య కెమెరా పెట్టి ‘మీకు నచ్చింది చేసుకోండి’ అని వదిలేశాడా? అనే డౌటు వేస్తుంటుంది. ఏ క్యారెక్టరూ ఒక గ్రాఫ్ కొనసాగించదు. ఎవర్నీ ఓన్ చేసుకోబుద్ది కాదు. ఏ ట్రాక్ మైండ్ లోకి వెళ్లదు. దాంతో కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోయింది.
‘ఐయామ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్’ అంటూ సత్య చేసిన హడావుడి కాస్త బెటర్. అక్కడక్కడ కాస్త రిలీఫ్ కలుగుతుంటుంది. అది కూడా రైటింగ్ స్కిల్ వల్ల కాదని, సత్య కామెడీ టైమింగ్ వల్ల అని అర్థమైపోతుంటుంది. అయితే ఓ దశలో అది కూడా ‘అతి’లానే అనిపిస్తుంది. సెకండాఫ్ లో కథ రోడ్డుమీద పడుతుంది. అవన్నీ పాత సినిమాల్ని గుర్తు తెస్తుంటుంది. కులపిచ్చి పాత్ర కూడా `సామజవరగమన` సినిమాలోని `కులశేఖర్` పాత్రకు కొనసాగింపులా ఉంటుంది తప్ప, అదేదో కొత్త వస్తువు అనిపించదు. సినిమా నిండా డైలాగులే. ప్రతీ పాత్ర పేజీల కొద్దీ మాట్లాడుతుంటుంది. చెవిలో ఓ రకమైన శబ్ద కాలుష్యం తప్ప… కామెడీ అనేది మాత్రం పుట్టదు.
ప్రియదర్శి, ప్రసాద్ బెహర, రాగ మయూర్, విష్ణు.. వీళ్లంతా మంచి నటులే. కామెడీ టైటింగ్ ఉన్నవాళ్లే. కానీ.. వీళ్లు సైతం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంటుంది. దానికి కారణం.. రైటింగ్ లో ఉన్న స్కిల్ మాత్రమే అనుకోవాలి. కాస్తలో కాస్త ప్రసాద్ బెహర బెటర్. తను కొంత సెటిల్డ్ గా చేశాడు. దాని వల్ల అతని పంచ్‌లు, సిల్లీ ఎక్స్‌ప్రెషన్సు కొన్ని పండాయి. సత్య ఎప్పట్లానే రిలీఫ్ ఇస్తాడు. వెన్నెల కిషోర్ ని కూడా సరిగా వాడుకోలేదు. ఇలాంటి పాత్రలు మరో రెండు మూడు చేస్తే చాలు… వీటీ గణేశన్ ని తెలుగు చిత్రసీమ మర్చిపోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా స్టార్ నిహారిక.. వెండి తెరపై వెలగలేదు. తన లుక్స్ పెద్దగా ఆకట్టుకోవు. నటన కూడా అంతంత మాత్రమే. హీరోయిన్ పాత్రకు రాంగ్ సెలక్షన్. బ్రహ్మానందం ఒక పాటలో కనిపిస్తారంతే.
మూడు నిర్మాణ సంస్థలు చేసిన సినిమా ఇది. బన్నీ వాస్ సమర్పకుడిగా వ్యహరించారు. ఆయనకు నిర్మాణంలో మంచి పట్టు వుంది. కానీ ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం నామమాత్రంగా కనిపించాయి. చాలా చోట్ల చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం ఆకట్టుకోదు. కత్తందుకో జానకీ.. పాట ఫన్నీగా వున్నా, పెద్దగా వర్కవుట్ కాలేదు. రైటింగ్ పరంగా చాలా లోపాలున్నాయి. ఐడియా పరంగా కూడా చాలా వీక్ గా ఉన్న కథ ఇది. ఇలాంటి కథని నిర్మాత బన్నీ వాస్ ఎలా జడ్జ్ చేశారో అర్థం కాదు. జాతిరత్నాలు ఫ్లేవర్ లో మరో సినిమా చేయాలన్న ప్రయత్నం ఈసారికి సక్సెస్ కాలేదు.
ఈ సినిమాలో ఓ డైలాగ్ వుంది. ప్రియదర్శి రెండు నిమిషాల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటే.. ఓ పాత్ర ‘ఏంటిది’ అని అడుగుతుంది. వెంటనే కమెడియన్ సత్య ‘సోది..’ అంటాడు. ఈ డైలాగ్ ఆ రెండు నిమిషాలకు మాత్రమే కాదు.. రెండుగంటల సినిమాకీ వర్తిస్తుంది.
– అన్వర్
Telugu360 Rating: 1.5/5