వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం పదకొండు గంటలకు రావాలని ఈడీ నోటీసులు ఇస్తే సమయానికి చేరుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కమిషన్ల వసూళ్లలో ఆయనే కీలక సూత్రధారిగా వ్యవహరించారని సిట్ విచారణలో తేలింది.
ఈ కేసులో సిట్ అధికారులు ఆయన్ని అరెస్టు చేయగా, సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులోనూ మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ సిండికేట్ల నుంచి ముడుపుల సేకరణ, వాటిని మళ్లించడం వంటి వ్యవహారాల్లో పక్కా ఆధారాలు సేకరించిన అధికారులు, ఆ కోణంలోనే ఆయన్ని విచారిస్తున్నారు. ఎంపీ హోదాలో ఉంటూ తెర వెనుక చక్రం తిప్పారని, రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ అక్రమ వ్యాపారంలో ఆయన మాటే వేదంగా సాగిందని విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
విజయసాయిరెడ్డి విచారణలో కూడా మిథున్‌రెడ్డి చెప్పారనే అరబిందో నుంచి వంద కోట్ల రుణాన్ని సజ్జల శ్రీధర్ రెడ్డికి ఇప్పించినట్లుగా చెప్పారు. ఇలాంటివన్నీ విచారణలో అడిగే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో మిథున్‌రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉండదని.. విచారణ తర్వాత ఆయనను వదిలి పెడతారని భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి తరహాలోనే సుదీర్ఘంగా విచారణ సాగే అవకాశం ఉంది.
