గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ లో కీరవాణి స్పీచ్ అదిరిపోయింది. పోకిరి సినిమాని గుర్తు చేస్తూ సాగిన ఆయన మాటలు మహేష్ అభిమానులని అలరించాయి. ”స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆస్కార్ వరకు నా తమ్ముడు రాజమౌళితో కలిసి చేసిన ప్రయాణంలో ఎన్నో వింతలు విశేషాలు విడ్డూరాలు జరిగాయి. ట్రిపులార్ సినిమాతో గ్లోబ్ కి మరోవైపు వెళ్లడం జరిగింది. గ్లోబ్ అంటే కేవలం అమెరికా కాదు. ఎన్నో ఖండాలు దేశాలు ఉన్నాయి. ఎన్నెన్నో వింతలు ఉన్నాయి. వాట ఆవిష్కరించడానికి రాజమౌళి మహేష్ బాబు ఈ సినిమా ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది’.
”సూపర్ సార్ కృష్ణ గారంటే నాకు ఎంతో ఇష్టం గౌరవం. మోసగాళ్లకు మోసగాళ్లు సినిమా చూసి ఆయనకి అభిమానిగా మారిపోయాను. వారి వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అన్న నాకు ఎంతో ఇష్టం. పోకిరి సినిమా మహేష్ పవర్ ఫుల్ డైలాగ్స్, మిత్రుడు మణిశర్మ మ్యూజిక్ కోసం ఎన్నిసార్లు చూశానో నాకే గుర్తులేదు. నా ఫేవరెట్ సినిమా అది.”అని చెప్పుకొచ్చిన కీరవాణి ఇక్కడే పోకిరి డైలాగ్ ని తన స్పీచ్ లో గమ్మత్తుగా మిళితం చేశారు .
‘నేను మెలోడీ బాగా కొడతాను. బీట్ సరిగ్గా ఇవ్వలేనని పేరు నాకు వచ్చింది. ఇలా ఎందుకువచ్చిందో తెలీదు. కాకపోతే నేను కొత్తగా ఫ్లాట్ కొన్నాను. అది సిమెంటు తో కట్టినది కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ మీ గుండెల్లో కొత్త ఫ్లాట్ కొన్నాను. ప్రొడ్యూసర్ హ్యాపీ. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేసాడు. టైల్స్ వేస్తున్నారు. బీట్ నాదే మెలోడీ నాదే. 2027 సమ్మర్ కి గృహప్రవేశం’ అంటూ పోకిరీ ఐకానిక్ డైలాగ్ ని మిక్స్ చేయడం మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా అలరించింది.


