మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావును చత్తీస్ ఘడ్ అడవుల్లో ఎన్ కౌంటర్ చేయడం…కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంతోషపరుస్తోంది. ఎన్ కౌంటర్ లో నంబాల కేశవరావు చనిపోయారని నిర్దారణ చేసుకున్న తర్వాత అమిత షా ట్వీట్ చేశారు. నక్సలిజం అంతం దిశగా గొప్ప విజయం సాధించామన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం ఉండకుండా చేస్తామని స్పష్టం చేశారు. అమిత్ షా ట్వీట్ పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మావోయిస్టులపై గొప్ప విజయం సాధించామని.. హోంశాఖను అభినందించారు.
స్వయంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా ట్వీట్లు చేసి స్పందించారంటే.. నంబాల కేశవరావు ఏ స్థాయి మావోయిస్టో అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టులు చేసే మిలటరీ దాడుల్లో, హత్యాయత్నాల్లో ఆయన పాత్రే కీలకం. చంద్రబాబుపై హత్యాయత్నానికి కూడా నంబాల కేశవరావే ప్లాన్ సిద్ధం చేశాడని అంటారు. వందల మంది బలగాలు చనిపోయే ఘటనల్లో కేశవరావు పాత్ర కీలకం. అందుకే ఆయన చనిపోవడం అంటే.. మావోయిస్టు పార్టీ పునాదులు పెకిలించినట్లేనని భావిస్తున్నారు. మోదీ, షా ట్వీట్లు దాన్నే సూచిస్తున్నాయి.
నంబాల కేశవరావుపై కోటిన్నరకు పైగా రివార్డు ఉంది. ఈ స్థాయిలో రివార్డు మామూలు మావోయిస్టులకు ప్రకటించరు. మావోయిస్టు పార్టీలో ఇక బతికి ఉన్న అగ్రనేతలెవరన్నది అర్థం కాని పజిల్ గా మారింది. మిగిలిన వారి కోసం వేట సాగిస్తున్నారు. మరికొన్ని ఎన్ కౌంటర్ల వార్తలు త్వరలో వినే అవకాశం ఉంది. మావోయిస్టు అనే వ్యక్తి లేకుండా చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది. తమ పరిస్థితి అర్థమైపోయి శాంతి చర్చల కోసం పిలుపునిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం.. చర్చలు జరపాలని అంటున్నాయి.