“మోడీ ఒక్కరు మాత్రమే భారతదేశంలో ఇలా గెలుస్తారు… ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన్ని గెలిపించేందుకు ఉపయోగపడతారు.”
2019 ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఓ ఇంటర్యూలో చెప్పిన మాట ఇది. కేజ్రీవాల్ మోడీ అభిమని కాదు. కానీ ఎన్నికల ఫలితాలను చూసి ఆయనకు అలా చెప్పాలని అనిపించింది. ఇప్పటికి ఆరేళ్లు గడిచాయి. ఎన్నో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలూ జరిగాయి. కానీ అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది మాత్రం తప్పు కాలేదు. ఇప్పటికీ మోదీని ఎవరూ ఓడించలేకపోతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి బీజేపీ, నితీష్ కూటమి గెలుస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ 20 ఏళ్లులో మధ్యలో కొద్ది రోజులు తప్ప అంతా నితీష్ కుమారే సీఎంగా ఉన్నారు. అంతకు ముందు ఎప్పుడో ఏడేళ్ల పాటు సీఎంగా చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజ్ ను గుర్తు చేసి.. ఆయనను ఇరవై ఏళ్లుగా ఓడిస్తున్నారు. కానీ ఇరవై ఏళ్ల పాటు బీహార్ .. దేశంతో పాటు ముందుకు పోలేదని అక్కడి ప్రజలు వలస బాటలో ఉండి.. ఇతర రాష్ట్రాల్లో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని మాత్రం గుర్తించడం లేదు. ఇరవై ఏళ్లలో చాలా రాష్ట్రాలు ముందుకెళ్లాయి. కానీ బీహార్ ప్రజలు మాత్రం ఆయా రాష్ట్రాల్లో కూలీ పనులు చేసుకోవడానికే ఉయోగపడుతున్నారు. ఎందుకు బీహార్ మారడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారని ..నితీష్ కుమార్ ను తరిమేస్తారని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. తిరుగులేని మెజార్టీతో బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలను చూసి అందరూ మరోసారి మోడీ జయహో అంటున్నారు. ఆయనను ఓడించే లీడర్ లేడని.. ఆయనకే విసుగు వచ్చి రిటైర్మెంట్ తీసుకుంటేనే ఇతరులకు అవకాశం వస్తుందని విశ్లేషిస్తున్నారు. జరుగుతున్న రాజకీయాలను.. వస్తున్న ఫలితాలను చూస్తే.. కేజ్రీవాల్ అభిప్రాయంతో విభేధించేవారు దాదాపుగా ఉండరు.
నరేంద్రమోదీ ఎలా గెలుస్తున్నారు? బీజేపీని ఎలా గెలిపిస్తున్నారు?
నరేంద్రమోదీ ఎలా గెలుస్తున్నారు? ఇది చాలా మందికి అర్థం కాని విషయం. ఖచ్చితంగా ఓడిపోతారనుకున్న చోట్ల గెలుస్తున్నారు. గెలుస్తారని అనుకున్న చోట్ల ఇంకా బీభత్సంగా గెలుస్తున్నారు. అలాగని ఆయనకు గెలుపులే కాదు కొన్ని పరాజయాలూ ఉన్నాయి. అవి ఆయన ఇమేజ్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీ ఇప్పుడు అంతటా విస్తరించింది. బెంగాల్ లాంటిచోట్ల కూడా పాతుకుపోయిందంటే.. ఇక తెలంగాణ ఓ లెక్క లేదు. 2014 మే 26న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అన్నీ తిరుగులేని విజయాలే వచ్చాయి. 2022 గుజరాత్లో 156 సీట్లతో ‘ఎవర్-విన్నింగ్’ రికార్డ్, 2024 మహారాష్ట్రలో 132 సీట్లతో 88% స్ట్రైక్ రేట్ మోడీ హయాంలో బీజేపీ అసెంబ్లీల్లో రికార్డుల సృష్టించింది. 2017లో UPలో 312 సీట్లు సాధించింది. 2018లో MP, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో మెజారిటీలు. 2019లో కాంగ్రెస్‌ను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మారింది. గుజరాత్లో 3 ముఖ్యమంత్రులు మారినా 156 సీట్లు వచ్చాయి. మరోసారి గుజరాత్ లో ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తుంది. మరో పార్టీ గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ప్రత్యర్థి ఎదగడం లేదు. ఒక్క గుజరాత్ కాదు.. చాలా రాష్ట్రాల్లో బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపిస్తున్నారు కానీ.. ప్రత్యామ్నయంగా ఉన్న పార్టీలకు అసలు చాన్స్ రావడం లేదు. అలాంటి రిస్క్ తీసుకోవాలని ప్రజలు అనుకోవడం లేదు. ఎందుకంటే మోదీ కాకపోతే ఇంకెవరూ లేరని అనుకుంటున్నారు.
మోదీ గెలుస్తున్నారు… మోదీని ప్రత్యర్థులు గెలిపిస్తున్నారు !
బీజేపీ, మోదీ ఇలా ఎందుకు గెలుస్తున్నారంటే.. దానికి ప్రధాన కారణం…మోదీకి ధీటైన నేత లేకపోవడం మాత్రమే కాదు…విపక్షాల్లో సరైన ఐక్యత లేకపోవడం కూడా. కేజ్రీవాల్ చెప్పినట్లుగా ఆయన వ్యతిరేకులు కూడా ఆయనను గెలిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సాయం చేస్తూ ఉంటారు. కాకపోతే నేరుగా కాదు.. వారి చేతకాని తనం, అనైక్యత వల్ల. 2014లో బీజేపీ ఒంటరిగా 282 సీట్లు, 2019లో 303 సీట్లు, 2024లో కూటమితో 293 సీట్లు గెలుచుకోగలిగినప్పుడు కాంగ్రెస్-నేతృత్వంలోని యూపీఏ 2014లో 44 సీట్లకు, 2019లో 52 సీట్లకు పరిమితమైంది. 2024లో INDIA కూటమి 234 సీట్లు సాధించినా, ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది. అసెంబ్లీ పరంగా కూడా అంతే. ఉత్తరప్రదేశ్‌లో 2017లో 312 సీట్లు, గుజరాత్లో 2022లో 156 సీట్లు, మహారాష్ట్రలో 2024లో 132 సీట్లు ఈ రికార్డులు సృష్టించినప్పుడు విపక్షాలు విడివిడిగా పోటీ చేశాయి. కలసి పోటీ చేసినా వారి మధ్య ఐక్యత లేదు. , ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి 2022లో కూడా బీజేపీని ఆపలేకపోయింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రీజనల్ పార్టీలు బలంగా ఉన్నా, జాతీయ స్థాయిలో ఒకే నినాదం, ఒకే నాయకత్వం లేకపోవడం బీజేపీకి లాభించింది. అందుకే “బీజేపీ గెలవడం కంటే విపక్షాలు ఓడిపోతున్నాయి” అని ఎక్కువగా అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ యంత్రాంగం, ఆర్ఎస్ఎస్ నెట్వర్క్, కార్పొరేట్ ఫండింగ్, మీడియా డామినెన్స్, ఎజెన్సీల వినియోగం – ఇవన్నీ కూడా విపక్షాలను బలహీనపరుస్తున్నాయి. అలాగే విపక్షాలు తమ ఇంటర్నల్ గొడవలు, నాయకత్వ సంక్షోభం, స్థానిక-జాతీయ వ్యూహాల మధ్య అంతరం తొలగించుకోలేకపోవడంతో.. మోదీ పని సులువు అవుతోంది.
అలాగని మోదీ పాలనా విజయాలు చిన్నవి కాదు !
విపక్షాల బలహీనత ఎక్కువే. కానీ మోదీ పాలనా విజయాలను తక్కువ చేయలేం. దేశానికి రాచపుండులా పట్టి పీడిస్తున్న సమస్యలకు ఆయన సులువుగా పరిష్కారం చూపించారు. స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్లలో ఎవరూ తాకలేని, తాకితే రాజకీయంగా నష్టోతామని అధికారంలో ఉన్న పార్టీలు భయపడిన అతి సున్నితమైన సమస్యలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ధైర్యంగా ఎదుర్కొని శాశ్వతంగా పరిష్కరించింది. ఈ నిర్ణయాలు కేవలం చట్టపరమైన మార్పులు మాత్రమే కాదు – దేశ ఐక్యత, భావోద్వేగాలు, జాతీయ గర్వాన్ని తాకిన చారిత్రాత్మక విజయాలు. 2019 ఆగస్టు 5న పార్లమెంట్ రెండు సభల్లోనూ ఆర్టికల్ 370, 35A రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. 1949లో “తాత్కాలిక నిబంధన”గా పెట్టిన ఈ ఆర్టికల్‌కు ఏడు దశాబ్దాల తర్వాత శాశ్వత ముగింపు పలికారు. ఫలితంగా కశ్మీర్ మారిపోయింది. 492 ఏళ్ల రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదానికి మోదీ హయాంలోపరిష్కారం లభించింది. దేశవ్యాప్తంగా ఒక్క గొడవ లేకుండా శాంతియుతంగా పరిష్కారం జరగడం చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఆలయం కూడా నిర్మితమయింది. ఇప్పుడు అయోధ్య రోజుకు 2-3 లక్షల భక్తులతో నిండిపోతోంది – హిందూ-ముస్లిం సామరస్యానికి చిహ్నంగా మారింది. ఈశాన్య రాష్ట్రాల్లో 2014 వరకు 30కి పైగా సాయుధ సంస్థలు యాక్టివ్‌గా ఉండేవి. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో 12 పెద్ద శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంది . దాదాపు 10,000 మంది మిలిటెంట్లు ఆయుధాలు వదిలిపెట్టారు. 1947 విభజన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్ఖ్, జైన్, బౌద్ధ, పార్సీ శరణార్థులకు 2024 మార్చి 11 నుంచి సీఏఏ కింద పౌరసత్వం మంజూరు ప్రారంభమైంది. ఇప్పటివరకు 14,000 మందికి పౌరసత్వం ఇచ్చారు. దశాబ్దాలుగా శిబిరాల్లో బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తోంది. ఈ సమస్యలను ఎవరైనా పరిష్కరించచగలరని ఎవరూ ఊహించలేదు. కానీ మోదీ చేశారు. ఇవే కాదు.. అభివృద్ధి పరంగా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రంగా .. గత పదకొడేళ్లలో దేశంలో అనూహ్యమైన మార్పులువస్తున్నాయి. ఇది మోదీ పాలనా ఘనతే.
పాలనలో ముస్లింలపై వివక్ష లేకపోవడం మోదీ రాజనీతిజ్ఞత
మోదీ విజయాల వెనుక మరో కీలక అంశం ప్రజల మధ్య సామరస్యం పెంచడం. మోదీ ప్రధాని అయితే ముస్లింలకు బ్రతుకు ఉండదని చాలా మంది అనుకున్నారు. కానీ అలాంటి అనుమానాలను మోదీ ఏటా పంచలు చేశారు. ముస్లింలపై దేశంలో ఎక్కడా వివక్ష లేదు. ప్రభుత్వ పరంగా వారిపై బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు. పాలనలో వెల్ఫేర్ పథకాలు, శిక్షణలు, ఆర్థిక సహాయాలు ముస్లింలకు రేషియో ప్రకారం అందుతున్నాయి. మైనారిటీలకు రూ. 22,000 కోట్లు 2014-2024 మధ్యలో కేటాయించారు. ముస్లింలకు రూ. 32 కోట్లు స్కాలర్షిప్లు, PMAYలో 11.8 కోట్ల ఇళ్లలో మైనారిటీలకు ప్రాధాన్యత , అయుష్మాన్ భారత్‌లో ముస్లింలు లబ్ధిదారులు, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ రద్దు వంటివి చేసి చూపించారు. ముస్లిం-డామినేటెడ్ ప్రాంతాల్లో ఇన్ఫ్రా డెవలప్మెంట్ పెరిగింది. అంటే ముస్లింలు అయినా దేశ ప్రజలు కాబట్టి వివక్ష చూపించలేదు. కానీ రాజకీయ వ్యూహం ప్రకారం వారిని టార్గెట్ చేస్తూంటారు. ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని కొంత మంది అంటూ ఉంటారు. కానీ జనాభా ప్రాతిపదికిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది. సెక్యూలర్ అంటే.. ముస్లింలును.. క్రిస్టియన్స్ ను నెత్తిన పెట్టుకుని ఇతర వర్గాలను కించపర్చడం కాదు. దేశంలో గతంతో పోలిస్తే ఇప్పుడు ముస్లింలు మరింత సేఫ్ గా ఉంటున్నారన్నది అందరూ అంగీకరించే విషయం. ఈ విషయంలో మోదీ రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. అంతే కానీ వారిని పాంపరింగ్ చేసి వారి ఓట్లు పొందాలని అనుకోలేదు. కానీ వారిపై వివక్ష మాత్రం చూపించలేదు. వివక్ష పెరిగితే ఆ వర్గంలో అది అలజడికి కారణం అవుతుంది. అది దేశానికే సమస్యలు తెచ్చి పెడుతుంది. అందుకే మోదీ.. రాజకీయంగానే .. ముస్లిం వ్యతిరేక రాజకీయాలు చేస్తారు కానీ.. బాధ్యతల పరంగా ఆయన ఎప్పుడూ తక్కువ చేయలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ గెలుపును కొంత మంది ఓట్ల చోరీ, ఈవీఎం అని అంటూ ఉంటారు. ఆడలేక మద్దెలఓడు అనేది వీరికి సరిపోతుంది. నరేంద్రమోదీ గెలుపుల గురించి.. “నరేంద్ర మోడీ ఒక వ్యక్తి కాదు… ఒక దృగ్విషయం. ఆయన్ని ఓడించాలంటే ముందు ఆ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవాలి.” అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన విషయం వీరు గుర్తు చేసుకోవచ్చు. ముందు నరేంద్రమోదీని ఓడించాలంటే.. ఆయన బలాలను గుర్తించాలి. బలహీనతలను గుర్తించాలి. కానీ ఇప్పుడున్న ప్రత్యర్థులకు అంత సామర్థ్యం లేదు. మోదీ కూడా విజయాలు వస్తున్నాయని ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు. అదే ఆయనను అజేయుడిగా మారుస్తోంది.

