మోడీ పర్యటన “పది నిమిషాలు” మాత్రమే చూపించడానికి మతలబు ఇదేనా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆదివారం గుంటూరు వస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన షెడ్యూల్ కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంది. అయితే ఇది అధికారిక కార్యక్రమాలు. గుంటూరులో అధికారిక కార్యక్రమాలుగా ఏం చేయబోతున్నారంటే.. ఎక్కడో… వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిష్ణపట్నం పోర్టు, విశాఖల్లో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన చిన్న చిన్న ప్రాజెక్టులకు… మీట నొక్కుతారు. దానికి గుంటూరులోనే ఈ కార్యక్రమం పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ.. పెట్టారు.. పది నిమిషాలు సమయం కేటాయించారు. అందులోనూ.. ఈ మీటల నొక్కేందుకు .. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎందుకీ హడావుడి అంటే.. పార్టీ కార్యక్రమం ఖర్చుని ప్రభుత్వ ఖాతాలో వేయడానికి..!

ఇప్పుడు ప్రధానమంత్రిహోదాలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఆయన దేశం మొత్తం తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా బీజేపీ ఖర్చు పెట్టడం లేదు. అంతా కేంద్ర ప్రభుత్వ ఖాతాలోనే పడిపోతోంది. అంటే.. అధికారిక కార్యక్రమానికి అన్నట్లుగా.. వెళ్లి అక్కడ బీజేపీ కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటున్నారు. బహిరంగసభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాురు. అలాగే గుంటూరులోనూ ఏర్పాటు చేశారు. పెట్టేది.. బీజేపీ తరపున బహిరంగసభ. కానీ ఏర్పాట్లు ఇతర ఖర్చులన్నీ.. కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేయడానికి.. అధికారికంగా.. ఓ పది నిమిషాల పాటు.. “మీటలు నొక్కే” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీటలు నొక్కడానికి గుంటూరుకు వస్తున్నారు కాబట్టి.. ఖర్చులన్నీ … ఆ ఖాతాలోకి పోతాయి. కానీ ఇక్కడ చేసేది.. బీజేపీ ప్రచారం.

జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్లు.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా.. కోల్‌కతా వెళ్లినా.. చెన్నై వెళ్లినా… ప్రజాధనంతో పర్యటనలు చేస్తున్నారని విమర్శలు చేస్తూ ఉంటారు. గతంలో… ఇలాంటి పర్యటనలకు… అధికారులు సహకరిస్తే.. వారి పెన్షన్ కట్ చేస్తామని కూడా బెదిరించారు. అలాంటి జీవీఎల్ ఉన్న పార్టీ అధినేత … కేంద్ర ప్రభుత్వ నిధులతో.. దేశం అంతా తిరిగి రాజకీయ ప్రచారం చేస్తున్నారు. కానీ జీవీఎల్‌కు మాత్రం… తాము చేస్తే సంసారంలాగే కనిపిస్తుంది. అందుకే.. జీవీఎల్ మాత్రమే కాదు.. ఎవరూ నోరు మెదపలేరు కూడా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com