ఉగ్రవాదులు మనపై దాడి చేశారు. మన జవాన్లను చంపేశారు. భారత్‌లో ఉన్న ఆవేశపరులందరూ ఊగిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొంతమంది అయితే చాలా చాలా ఆవేశపడిపోయి సినిమాటిక్ డైలాగులు పేల్చేశారు. తెలుగు మీడియాలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు కూడా ‘పాక్‌ని ఏసేద్దాం….’ అని మోడీ అండ్ కో డిస్కస్ చేసినట్టుగా వార్తలు రాసేశారు. గన్ చేతికివ్వండి…మేమే ఏసేస్తాం అని చాలా మంది క్లైమాక్స్‌లో తెలుగు హీరోలు కొట్టే రేంజ్ డైలాగులు కొట్టేశారు. ఎన్నికల సభలలో నరేంద్రమోడీవారు కూడా కొన్ని ఇలాంటి పంచ్ డైలాగులు పేల్చి ఉన్నారు. అటువైపు నవాజ్ షరీఫ్ కూడా నోటికొచ్చినట్టుగా వాగేసి ఉన్నాడు. అందుకే మోడీ కూడా ఎన్నికల సభలలో మాట్లాడినట్టుగానే రెచ్చిపోయి మాట్లాడేస్తాడా? అని చాలా మంది భయపడ్డారు. కానీ నరేంద్రమోడీ మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. భారత్ కూడా రెచ్చిపోవాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్న పాక్ ఉచ్చులో తను పడకుండా, పాకిస్తాన్నే తన ఉచ్చులోకి లాగాడు.
భారతదేశంపైన పాకిస్తాన్ ఉగ్రదాడులు ఎందుకు చేస్తోంది? కాశ్మీర్‌ని గెలుచుకోవడం కోసమా? పాకిస్తాన్లో ఆర్మీ మాటలను పాలకులు వింటారా? పాలకుల మాటలను ఆర్మీ వింటుందా? పాక్ ఆర్మీ మొత్తం కూడా టెర్రరిస్టులకు సానుభూతి పరులన్న విషయం వాస్తవం కాదా? భారత్‌పైన దాడులు చేసేలా పాక్‌ని ప్రోత్సహిస్తున్న బయటి శక్తులు లేవా? చైనా మాటేంటి? పాకిస్తాన్ భుజంపై నుంచి ఇండియాను టార్గెట్ చేస్తున్న మాట వాస్తవం కాదా? ఉమ్మితే పాక్ కొట్టుకుపోతుంది. —— పోస్తే మునిగిపోతుంది లాంటి డైలాగులు వినడానికి భలే ఉంటాయి. అలా చేస్తే పోయేది మనమే. పాకిస్తాన్ ఆల్రెడీ బురదలో ఉన్న దేశం. ఆ బురదను మనకు అంటించాలని కొన్ని బురదరాళ్ళను మనపైకి విసురుతోంది. మనల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తోంది. మనం కూడా రెచ్చిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఓ పాకిస్తాన్ దేశస్థుడికి ఎలాంటి గౌరవం లభిస్తోంది? అంతర్జాతీయ సమాజం పాకిస్తానీయులను ఎలా రిసీవ్ చేసుకుంటోంది? అదే పరిస్థితులు మనకు కూడా ఎదురవుతాయి. పాకిస్తాన్‌ని వెనకుండి నడిపిస్తున్న చైనాకు కావాల్సింది కూడా అదే.
పాకిస్తాన్ రెచ్చగొట్టిందని మనమూ రెచ్చిపోవడం అంటే వాళ్ళు పన్నిన ఉచ్చులో మనం చిక్కుకుని పాక్‌తో పాటు చైనాను కూడా గెలిపించడమే. అది భారత్‌కి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతీయులకు శాంతి కాముకులు అన్న పేరు ఉంది. ప్రత్యేక గౌరవం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులున్నారు. అలాగే ప్రపంచ దేశాలన్నింటితోనూ భారత్‌కు అవసరాలు ఉన్నాయి. అందుకే పాకిస్తాన్‌ని పాకిస్తాన్ పద్ధతులలోనే దెబ్బకొట్టాలనుకోవడం పాకిస్తాన్ స్థాయికి మనల్ని మనం దిగజార్చుకోవడమే. అప్పుడు గెలిచినా, ఓడినా చివరకు మిగిలేది మాత్రం ఓటమే. అలా అని పాకిస్తాన్‌ని వదిలేయ కూడదు. పాకిస్తాన్‌ని శిక్షించాలి. ఆ పోరాటం ఎలా ఉండాలి? నిన్న మోడీ ఇచ్చిన స్పీచ్‌లో అదే హైలైట్. ఉగ్రవాదం కారణంగా ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నది పాకిస్తాన్ ప్రజలే. అందుకే ఆ ప్రజలను ప్రభావితం చేయగలగాలి. ఇంటర్నెట్ యుగంలో సమాచారాన్ని దాచిపెట్టడం ఎవ్వరి తరం కూడా కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలూ అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ పురోగమిస్తుంటే కనీస హక్కులు కూడా లేకుండా కొంతమంది మూర్ఖులు, ఉగ్రవాదులు పెట్టే షరతుల మధ్య నలిగిపోవాలని ఆలోచన ఉన్న ఏ ఒక్కడూ కోరుకోడు. ఉగ్రవాదం వళ్ళ పాకిస్తాన్ ప్రజలు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకు తెలిసేలా చేయాలి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడేలా వాళ్ళను ప్రోత్సహించగలగాలి. నిన్న మోడీ మాట్లాడిన మాటలకు పాకిస్తాన్ పాలకుల దగ్గర సమాధానం ఉంటుందా? పేదరికం, నిరుద్యోగం లాంటి విషయాలపైన భారత్‌తో పోటీపడతాం, పాకిస్తాన్ పౌరులు కూడా అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునేలా చేస్తాం అని చెప్పగలరా? చెప్పలేరు. మహా అయితే భారతీయుల బ్రతుకులు కూడా బాగాలేవని ఎదురుదాడికి దిగుతారు. ముందు ముందు ఆ ఎదురుదాడికి కూడా అవకాశం లేనంతగా మనం అభివృద్ధి సాధించాలి. నిజమైన దేశభక్తి ఎప్పుడు కూడా శతృదేశాలను ద్వేషించడంలో కంటే కూడా మన దేశాన్ని ప్రేమించడంలో ఉంటుంది. మన దేశానికి నష్టం చేసే ఎన్నో తప్పులను మనం చాలా సరదాగా చేసేస్తూ ఉంటాం. సాటి భారతీయులకు నష్టం చేయడానికి కూడా మనలో చాలా మంది ఎప్పుడూ వెనుకాడరు. అక్కడ మన ఆలోచనలు మారాలి. ప్రతి భారతీయుడూ మన సోదరుడే అన్న వాస్తవానికి మన ఆలోచనల్లో స్థానం ఇవ్వాలి. అందరం బాగుండాలి. అభివృద్ధి సాధించడంలో ఒకళ్ళకొకళ్ళం సాయపడాలి అన్న స్పృహ మనలో ఉండాలి. మనం అభివృద్ధి సాధిస్తూ ఉన్నామంటే శతృవు ఓడిపోతూ ఉన్నట్టే లెక్క. ఫలితం ఎప్పుడూ కూడా ఒక్క రోజులో రాదు. ఎన్నో ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోతున్న టెర్రరిస్టులు ఒకటి రెండు ప్రయత్నాల్లో మాత్రం విజయం సాధిస్తున్నారు. అలా జరగకుండా సెక్యూరిటీని కూడా ఇంకా పటిష్టం చేయాలి. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌ని ఒంటరిని చేసేలా చేయగలగాలి. ఉగ్రవాదం తమ జీవితాలను ఏ స్థాయికి పతనం చేస్తుందో, కనీస స్థాయి సౌకర్యాలు, సంతోషాలు లేకుండా చేస్తుందో పాకిస్తాన్ ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి. అదీ అసలైన విజయం. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం గురించి చాలా దేశాలు గొప్పగా మాట్లాడుకుంటాయి.
ఇప్పుడు మనం పాకిస్తాన్‌పైన సాధించబోయే విజయం కూడా ఆ స్థాయిలో ఉండాలి. పాకిస్తాన్‌ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం మోడీ చేస్తున్న ప్రయత్నాలు అర్థవంతంగానూ, ఆదర్శవంతంగా కూడా ఉన్నాయి. భారత్‌కి నష్టం చేసే అవకాశమే లేని ఇలాంటి విధానాల విషయంలో అయినా మన లౌకిక(?) బ్రాండ్ నాయకులు, కమ్యూనిస్టులు, కుల నాయకులు, మత నాయకులు మోడీకి కాస్త సపోర్ట్ చేస్తారేమో చూడాలి మరి.