బీహార్లో గెలుపును బీజేపీ కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా ప్రధాని మోదీ ఈ అంశాన్ని టేకప్ చేసినట్లుగా కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా పరిపాలిస్తున్న నితీష్ కుమార్ పై అసంతృప్తి తీవ్రంగా ఉన్నా సరే.. పొలిటికల్ టెక్నిక్లతో గట్టెక్కాలని మోదీ ప్లాన్లు చేసుకున్నారు. ఓ వైపు ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి సిగపట్లు,లాలూ కుటుంబంలో చిచ్చు వంటి వాటితో పాటు ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా అధికార వ్యతిరేక ఓట్లు చీల్చే అవకాశం ఉండటంతో .. మోదీ రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఒక్కో మహిళకు పదివేలు పంపిణీ చేసేశారు.
75 లక్షల మంది మహిళలకు తలా రూ. పదివేలు
బీహార్ లో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని మోదీ ప్రారంభించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు వ్యాపారం ప్రారంభించడానికి రూ.10,000 వారి ఖాతాలకు జమ చేశారు. మొత్తం 75 లక్షల మంది మహిళలకు రూ.7,500 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇది వన్ టైమ్ కాదు. ప్రభుత్వం వస్తే మళ్లీ ఇస్తామన్నట్లుగా.. ఇది మొదటి విడత అని కూడా చెప్పారు. ఎన్నికలకు ముందు మోదీ ఓట్లను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. వారి ఆవేదన వారిది. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఎన్ని అయినా అమలు చేసుకోవచ్చు.
కాంగ్రెస్ చేస్తోంది కూడా అదేగా !
ఇప్పుడు రాజకీయాలు ఎలా మారిపోయాయంటే అధికారంలో ఉంటే ప్రభుత్వం డబ్బుల్ని ప్రజల ఖాతాల్లోకి ఇంకా చెప్పాలంటే.. ఓటు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసి .. ఓట్లు వేయడం మర్చిపోవద్దని చెప్పడం లా మారిపోయాయి. అతి తెలివి రాజకీయ నేతలు వచ్చిన తర్వాత పరిస్థితి ఇంకా ఘోరంగా మారిపోయింది. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి మరీ ఇలా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఒకరు డబ్బులివ్వకపోతే.. ఆ పార్టీ ఇచ్చింది మీరెందుకు ఇవ్వరని ప్రజలు అడుగుతారు. ఇలాంటి పరిస్థితి వచ్చే సరికి.. ప్రధానికి అయినా తప్పడంలేదు. రూల్స్ కు విరుద్ధం ఏమీ కాదు కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇలాంటి పథకాల పేరు చెప్పే అధికారంలోకి వచ్చింది.
బీహార్ ప్రజల నాడి పట్టేసిన మోదీ
బీహార్ ప్రజల్ని ఎలా ట్యూన్ చేసి ఓట్లు రాబట్టుకోవాలో ప్రధాని మోదీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదమో అన్నట్లుగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. మహిళల ఖాతాల్లో పదివేలు వేస్తే వారు ఓటు మరో పార్టీకి వేసే అవకాశం ఉండదు. పైగా మళ్లీ గెలిస్తే మళ్లీ ఇస్తామని చెబుతున్నారు. నితీష్ కుమార్ పై నమ్మకం తగ్గిపోయింది కాబట్టి నేరుగా మోదీనే రంగంలోకి దిగి లీడ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పేరుతో దారి తప్పిపోయింది. మోదీకి ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు డబ్బులిస్తున్నారని గగ్గోలు పెట్టి ప్రయోజనం ఏమి ఉంటుంది.