మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీని ప్రశ్నించిన విద్యార్థి నేతలను కిడ్నాప్ చేసినట్లు నమోదైన కేసులో నటుడు మోహన్ బాబు కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును కొట్టివేయాలని , అలాగే విచారణ పూర్తయ్యే వరకు తమను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ దశలో అరెస్టు నుంచి ఎటువంటి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. బాధితుల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ తదుపరి విచారణను మార్చి నెలకు వాయిదా వేసింది.
ఇప్పటికే ఇతర నిందితుల అరెస్ట్
ఫిబ్రవరి 3వ తేదీన యూనివర్సిటీలో అధిక ఫీజుల వసూళ్లపై నిరసన తెలిపేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్‌లను కిడ్నాప్ చేసి, నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు మోహన్ బాబును ఏ3 గా, మంచు విష్ణును ఏ2 గా నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న పీఆర్వో సతీష్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. క్వాష్ పిటిషన్ విచారణలో భాగంగా, ఘటన జరిగిన రోజున తాను తిరుపతిలో లేనని మోహన్ బాబు బోర్డింగ్ పాస్‌లను కోర్టుకు సమర్పించినప్పటికీ, పోలీసులు మాత్రం వారి ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు.
కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోయినా అరెస్టు చేయరు !
కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించినప్పటికీ క్షేత్రస్థాయిలో మోహన్ బాబు కు అరెస్ట్ భయం పెద్దగా లేదని అనుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణం, అధికార వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే దీనికి ప్రధాన కారణం. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలను కూడా న్యాయపరమైన రక్షణలు పొందే వరకు వేచి చూస్తున్న ప్రభుత్వం ..మోహన్ బాబు వంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం తక్కువనే చర్చ సాగుతోంది.
విచారణకు సహకరించకపోతే కష్టమే !
పోలీసులు ఇప్పటికే మంచు విష్ణుకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 15 వరకు షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయని, ఆ తర్వాతే వస్తానని ఆయన పోలీసులకు బదులిచ్చారు. ఆ గడువు ముగిసిపోయినా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. మోహన్ బాబు అసలు నోటీసులు తీసుకునేందుకు అందుబాటులోకి రాలేదు. అందుకే విచారణకు సహకరించకపోతే పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.
