పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఏ తల్లీ దూరం చేసుకోదు. అవసరమైతే తన ప్రాణం అడ్డేసి మరీ కాపాడుకుంటుంది. ఓ తల్లి ఏకంగా ప్రియుడి కోసం తన కుమారుడిని యాబై వేలకు బేరం పెట్టింది. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుకుంది.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చోటు చేసుకున్న ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. లావణ్య అనే మహిళకు ఐదేళ్ల కుమారుడు నిఖిల్ ఉన్నాడు. భర్త మరణించడంతో ఆమెకు సాయిలు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం సహజీవనంకు దారితీసింది. అప్పటికే సాయిలు కూడా పెళ్లి అయింది. లావణ్యతో సహజీవనం విషయం సాయిలు భార్యకు తెలిసి భర్తను నిలదీసింది. అయినా లావణ్యను సాయిలు తరుచుగా కలుస్తుండటంతో, సాయిలు భార్య అతని నుంచి దూరంగా ఉంటోంది. అప్పటి నుంచి లావణ్య – సాయిలు కలిసే ఉంటున్నారు.
ఇక, కలిసి కాపురం చేస్తున్న దశలో వారి జీవనోపాధి కష్టంగా మారింది. ఆటో కొనాలనుకున్న సాయిలు, తన మనసులో మాటను లావణ్యకు చెప్పాడు. యాభై వేలు అంటే కష్టమని చెప్పడంతో , కొడుకును అమ్మేయాలని లావణ్యకు చెప్పాడు. అందుకు లావణ్య కూడా అంగీకరించింది. లావణ్య పర్మల్ల గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు 50వేలకు అమ్మేసింది. నసీమా, తన సోదరి షహీదాకు ఆ ఆ బాలుడిని అప్పగించింది. ఆమె మరో శేఖర్ అనే వ్యక్తికి లక్ష రూపాయలకు విక్రయించింది.
ఈ విషయం బయటకు తెలియడంతో బాలల సంక్షేమ అధికారులు లింగంపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. వెంటనే రంగంలోకి దిగి బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడుని బేరం పెట్టడంపై లావణ్య, సాయిలు, నసీమా, షాహీదాపై కేసు నమోదైంది. ఈ విషయం బయటకు పొక్కడంతో..కన్నకొడుకును అమ్మేందుకు సిగ్గు లేదా తల్లీ అంటూ లావణ్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.