ప‌సుపు బోర్డుపై ఎంపీ అర‌వింద్ మాట మార్చేశారే..!

ఎన్నిక‌ల ముందు నాయ‌కులు ఇచ్చిన హామీలు అమ‌లు చెయ్య‌రు, గెలిచాక మాట మార్చేస్తారు అనే ఒక స్థాయి న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిపోయింది. య‌స్… అదే ముమ్మాటికీ నిజం అని నిరూపించేందుకు చాలామంది నాయ‌కులుంటారు! ఇప్పుడు ఆ కోవ‌లోనే నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ను జ‌మ‌క‌ట్టాలి..! ఆయ‌న నిజామాబాద్ లోక్ స‌భ స‌భ్యునిగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత‌పై విజ‌యం సాధించారు. కవిత మీద గెలుపు అంటే.. భేష్ అన్నారంతా. ఇంత‌కీ ఆయ‌న్ని గెలిపించిన అంశ‌మేంటీ…. ప‌సుపు రైతుల స‌మ‌స్య‌లు. తాను గెలిస్తే ప‌సుపు బోర్డు తీసుకొస్తా, జాతీయ స్థాయిలో ప‌సుపు రైతుల‌కు గుర్తింపు తెచ్చేస్తా అని హామీ ఇచ్చారు. తెరాస మిమ్మ‌ల్ని పట్టించుకోలేదు, నేను అండ‌గా ఉంటాన‌ని న‌మ్మించారు. రైతులు న‌మ్మారు, ఆయ‌న గెలిచారు. మ‌రి ఆయ‌న్ని న‌మ్మిన రైతులు…?

ప‌సుపు బోర్డు మీద అర‌వింద్ నాలిక ఇప్పుడు మ‌డ‌త‌ప‌డిపోయింది. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ప‌సుపు రైతుల‌కు బోర్డుకు మించిన ప్ర‌యోజ‌నాలు రాబోతున్నాయ‌న్నారు. ఒక శాశ్వ‌త ప‌రిష్కారం రాబోతోంద‌న్నారు! బోర్డు వ‌స్తుందా, ప్ర‌త్యామ్నాయంగా ఇంకేదైనా వ‌స్తుందా అనే స్ప‌ష్ట‌త కోసం విలేక‌రులు ప్ర‌య‌త్నిస్తే… కారు ఉదాహ‌ర‌ణ చెప్పారు అర‌వింద్. కారు కావాలంటే ముప్ప‌య్యేళ్ల కింద‌టి అంబాసిడ‌ర్ కావాలా, కొత్త ట‌యోటా కావాలా, ఇది ట‌యోటా జ‌మానా అన్నారు. అంటే, బోర్డు ఉండ‌ద‌నే క‌దా అర్థం! ఇప్పుడు ప‌ద్ధ‌తులు మారాయ‌నీ, నూత‌న విధానాల అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒక బ్ర‌హ్మాండ‌మైన వ్య‌వ‌స్థ వ‌స్తుంద‌న్నారు. ఆ బ్ర‌హ్మాండ‌మేంటో చెప్పండ‌య్యా అంటే… త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌నే తాను ఆశిస్తున్నా అన్నారు.

ప‌సుపు బోర్డు మీద అర‌వింద్ చేతులెత్తేసిన‌ట్టుగా మాట్లాడారు. ఈ బోర్డు అంశంతోనే ఆయ‌న రాజ‌కీయంగా చాలా ల‌బ్ధి పొందారు. ఇప్పుడ‌ది పాత కారు అయిపోయింది! గెలిస్తే ఐదు రోజుల్లో బోర్డు తెస్తాన‌ని ఎన్నిక‌ల ముందు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం నుంచి ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌నే చేయించ‌లేక‌పోయారు. ఇక ఇది వ‌చ్చేదీ లేద‌న్న స్ప‌ష్ట‌త వ‌చ్చేసిందో ఏమో… ఇలా మాట మార్చేశారు. ఈ అంశాన్ని తెరాస అనుకూలంగా మార్చుకోవ‌డం ఖాయం. బోర్డుకు మించింది ఏదో వ‌స్తుంద‌నే ఆశాభావం త‌న‌కు ఉంద‌న్నారే త‌ప్ప‌, అదేంటో అర‌వింద్ చెప్ప‌లేక‌పోవ‌డం కూడా తెరాస‌కు రాజ‌కీయంగా ఎదురుదాడికి ఆస్కార‌మిచ్చిన‌ట్ట‌యింది. మొత్తానికి, నిజామాబాద్ రైతుల నుంచి, తెరాస నుంచి అర‌వింద్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొనే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com