చర్చనీయాంశంగా మారిన మరో భేటీ: భారతిని కలిసిన కవిత

హైదరాబాద్: మొన్న రామోజీరావుతో జగన్ భేటీ తెలుగురాష్ట్రాలు రెండింటిలో పెద్ద చర్చనీయాంశమైతే, ఇప్పుడు జగన్ భార్య భారతితో కేసీఆర్ కుమార్తె కవిత భేటీ అదేస్థాయిలో చర్చకు దారితీసింది. కవిత నిన్న హైదరాబాద్‌లో జగన్ నివాసం లోటస్ పాండ్‌కు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి, సాక్షి మీడియాగ్రూప్ ఛైర్ పర్సన్ భారతిని కలిశారని, ఈనెల 12నుంచి తెలంగాణలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలలో పాల్గొనాల్సిందిగా కోరారని ఈనాడుసహా పలు దినపత్రికలలో వచ్చింది. జగన్‌కూడా అక్కడ ఉన్నట్లు కొన్ని పత్రికలలో రాశారు.

రామోజీ-జగన్ భేటీకి, కవిత-భారతి భేటీకి సంబంధముందని అభిజ్ఞవర్గాలనుంచి ఒక కథనం వినబడుతోంది. దాని వివరాలు ఇలా ఉన్నాయి – చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్ళిప్పుడల్లా జగన్ కేసుపై దర్యాప్తును వేగవంతం చేయాలని, జేడీ లక్ష్మీనారాయణకు మళ్ళీ ఈ కేసును అప్పగించాలని కేంద్రం పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో జగన్ తాకిడిని తట్టుకోలేకపోతున్నామని, ఎలాగైనా అతనిని మళ్ళీ ‘లోపలకు’ పంపించాలని కోరుతున్నారు. ఈ కేసు విచారణను ప్రతి శుక్రవారం జరపాలని సీబీఐ కోర్ట్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ ఒత్తిడి ఫలితమే. చంద్రబాబు తనను ఇరికించాలని చేస్తున్న ఈ ప్రయత్నాలు జగన్‌కు తెలిశాయి. అసలే కేసులగురించి తీవ్రంగా బెంబేలుపడే జగన్, ఈ పరిణామాలతో మరింత కలత చెందారు. దీనిపై విజయసాయిరెడ్డివంటి తన థింక్ ట్యాంక్‌ సభ్యులతో చర్చలు జరిపి కేసీఆర్‌ను ఆశ్రయించాలని నిర్ణయానికొచ్చారు. ఆ మేరకు కేసీఆర్‌ను కలిశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కనుక సమస్యను అటువైపునుంచే నరుక్కురావాలని సూచించిన కేసీఆర్, నరేంద్రమోడితో, ఇతర బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రామోజీరావే దీనికి పరిష్కారమని చెప్పారు. మోడి స్వయంగా రామోజీని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగస్వామిగా నామినేట్ చేసిన విషయాన్ని ఉటంకించారు. రామోజీని కలవమని సలహా ఇచ్చారు. రామోజీకి తానుకూడా చెబుతానని ధైర్యం చెప్పారు(తెలంగాణలో తన ఆస్తులు కాపాడుకోవటానికి రామోజీ కేసీఆర్‌తో రాజీపడ్డారు, తమ మీడియాలో టీఆర్ఎస్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారు).

రామోజీరావును జగన్ కొన్ని ఫంక్షన్‌లలో కలవటం, పత్రికా సిబ్బంది, వేతనాల విషయంలో ఈనాడు-సాక్షి మధ్య అవగాహన కుదరటంవంటి పరిణామాలు ఆ మధ్య చోటుచేసుకుని ఉన్నాయి. రామోజీరావు పెద్ద కోడలు శైలజ, భారతికి మధ్య సంబంధాలుకూడా ఉండటంతో ముందుగా భారతి ఫిల్మ్‌సిటీకి వెళ్ళి రామోజీరావును కలిసి జగన్‌ భేటీకి ఒక వేదిక సిద్ధం చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు భూమన కరుణాకరరెడ్డి ఇంట్లో శుభకార్యానికి పిలవటానికి అనే నెపంతో జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్ళారు. రామోజీతో ఆంతరంగిక చర్చలు జరిపారు. సమస్యను వివరించారు. అయితే రామోజీ స్పందన ఏమిటన్నదీ తెలియటంలేదు. రానున్నకాలంలో జగన్‌ విషయంలో ‘ఈనాడు’ అనుసరించే వైఖరినిబట్టి రామోజీ స్పందన తెలుసుకోవచ్చు. మరోవైపు, కేసీఆర్ జగన్‌కు మధ్య కొంతకాలంగా నెలకొన్న సత్సంబందాలు తాజా పరిణామంతో మరింత బలపడ్డాయి. ఇరు కుటుంబాల సభ్యులుకూడా దగ్గరయ్యారు. వాటిలో భాగంగానే కవిత తాజాగా భారతితో భేటీ అయ్యారు.

ఇదీ ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథనం సారాంశం. ఏదిఏమైనా ఈ భేటీ – కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని తెలుగుదేశం కొంతకాలంగా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేవిధంగా ఉందనటంలో సందేహంలేదు. ఈ అంశం ఆధారంగా వైసీపీపై తెలుగుదేశం దాడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ తెలంగాణ నాయకుడు కొత్తకోట దయాకరరెడ్డి ఇప్పటికే దాడి ప్రారంభించారు. సాక్షాత్తూ పార్లమెంట్ నిండుసభలో తెలంగాణను వ్యతిరేకించిన జగన్‌ కుటుంబాన్ని బతుకమ్మ పండుగకు ఎలా ఆహ్వానిస్తారని ఇవాళ విమర్శించారు. తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్న వైసీపీ నాయకురాలు షర్మిలను వదిలేసి భారతిని బతుకమ్మకు ఆహ్వానించటమేమిటని మరో విమర్శ వ్యక్తమవుతుంది. మరోవైపు జగన్ తన కేసులకోసం మెట్టుదిగి రామోజీరావు గడప తొక్కారని, తమ పరువు తీసేశారంటూ వైసీపీ లోని హార్డ్‌కోర్ కార్యకర్తలు కొందరు మండిపడుతున్నారని సమాచారం. ప్రత్యర్థుల విషయంలో వైఎస్ ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదని, మడమ తిప్పకుండా పోరాడేవారని వారు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com