ములాయం సింగ్ యాదవ్ కొంచెం కొంచెంగా ఓపెన్ అయ్యారు. తన పదవీ వ్యామోహాన్ని బయట పెట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి అవడం ఖాయం అన్న భారీ ఆశలతో ముఖ్యమంత్రి పదవిని కొడుక్కి కట్టబెట్టాడు. నితీష్ కుమార్ కూడా సేం ప్లాన్ వేశాడు. కేజ్రీవాల్ ఐడియా కూడా అదే. అయితే నరేంద్రమోడీ దెబ్బకు ముగ్గురి ఆశలూ తలకిందులైపోయాయి. అయితే కేజ్రీవాల్, నితీష్‌లు సిఎం కుర్చీని మళ్ళీ ఎక్కడంలో సక్సెస్ అయ్యారు. కానీ ములాయం సింగ్‌కి అలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. దానికి కారణం సొంత కొడుకే. తనకు ప్రధానమంత్రి పదవి వస్తుందున్న ఉద్ధేశ్యంతో కాళ్ళ దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి పదవిని కొడుక్కి అప్పగించేశాడు. కానీ నెక్ట్స్ ఐదేళ్ళు కూడా ప్రధానమంత్రిగా మోడీనే కంటిన్యూ అవకాశాలు కనిపిస్తుండడంతో ప్రధాని పదవి ఆశలు వదిలేసుకున్నాడు ములాయం. అందుకే అర్జెంట్‌గా ఏదో ఒక పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. నరేంద్రమోడీకి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో తన పార్టీ ఎంపిలను అడ్డు వేసి గవర్నర్ పదవిని దక్కించుకునే పరిస్థితులు కూడా లేవు. అందుకే ముఖ్యమంత్రి పదవిపైన కన్నేశాడు ములాయం. ఆ ప్రయత్నంలో భాగంగానే అమర్‌సింగ్‌తో సహా తనకు గతంలో సపోర్ట్ చేసిన పార్టీ పాత కాపులందరినీ దగ్గరకు తీయడం స్టార్ట్ చేశాడు. తండ్రి కోసం అయినా సరే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేని అఖిలేష్ యాదవ్ తన జాగ్రత్తలో తాను ఉన్నాడు.
కొడుకుని పదవి నుంచి దించి తాను గద్దెనెక్కాడు అంటే కొంతైనా చెడ్డపేరు రావడం ఖాయం. అందుకే అలా చేయడం ఇష్టంలేని ములాయం ఇప్పుడో మాస్టర్ స్కెచ్ వేశాడు. అఖిలేష్ యాదవ్ పాలన అంత గొప్పగా లేదన్న ప్రచారాన్ని తనే ప్రారంభించాడు. అఖిలేష్ యాదవ్ వళ్ళనే తాను ప్రధాని కాలేకపోయానని చెప్తున్నాడు. 2012లో అఖిలేష్ యాదవ్‌ని ముఖ్యమంత్రిని చేయడం వళ్ళే సరైన సంఖ్యలో ఎంపి స్థానాలు గెల్చుకోలేకపోయామని…అదే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే చించేశావాళ్ళం అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. రేపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎస్పీ అధికారంలోకి వస్తే ములాయం సింగే ముఖ్యమంత్రి అన్న ప్రచారంతో ప్రజల ముందుకు వెళ్ళాలని ములాయం భావిస్తున్నాడు. గెలిస్తే వెంటనే సిఎం కుర్చీ ఎక్కేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక సారి అధికార బోగాలకు అలవాటు పడిన అఖిలేష్ యాదవ్ మాత్రం ముఖ్యమంత్రి పదవిని తండ్రికి అప్పగించడానికి సిద్ధంగా లేడు. అందుకే తన ప్రయత్నాలు తాను కూడా చేసుకుంటున్నాడు. ములాయం సింగ్ పార్టీలో పుట్టిన ముసలం మరి కాస్త పెద్దదైతే మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం తండ్రీ కొడుకులు చేయబోయే రసవత్తర పోరాటం మనకు కనువిందు చేయడం ఖాయం.