దేశ ఆర్థిక రాజధాని ముంబై. ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సుదీర్ఘ కాలంగా శివసేన చేతుల్లోనే ముంబై ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అందుకే ఈ సారి ఎవరిది విజయం అన్నది పెద్ద సస్పెన్స్‌గా మారింది. మేయర్ పదవిని ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో లాగే రెండు కూటములు తలపడుతున్నాయి. కానీ ఆ పార్టీల తీరే చాలా భిన్నంగా ఉంటోంది.
ఠాక్రే సోదరులపైనే అందరి దృష్టి
ఆసియాలోనే అత్యంత సంపన్నమైన ఈ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు సాధించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊపును కొనసాగించాలని అధికార కూటమి భావిస్తుంటే, తన పాత కోటను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుదలతో ఉన్నారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ విభేదాల తర్వాత ఠాక్రే సోదరులు చేతులు కలపడం ముంబై రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం. శివసేన , MNS మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు మరాఠీ ఓటు బ్యాంకును ఏకీకృతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. “ఫక్త్ ఠాక్రే” అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు
చాలెంజింగ్‌గా తీసుకున్న ఫడ్నవీస్
బీజేపీ కూటమి అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ, ముంబైలో తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముంబై అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాలను ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఉత్తర, దక్షిణ భారత ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, మరాఠీ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్న ఠాక్రే సోదరుల వ్యూహానికి ఎలా ఎదురు నిలుస్తాయనేది ఆసక్తి కరంగా మారింది. మరాఠీ సెంటిమెంట్ పెరిగితే అది బీజేపీకి పెనుశాపంగా మారుతుంది.
అయోమయంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా ఉంది. మహా వికాస్ అఘాడిలో భాగంగా ఉన్నప్పటికీ శివసేన తనదారి తాను చూసుకుంది. శ్రరద్ పవార్ రెండు పార్టీలు కలిసిపోయాయి. ముంబైలో ఎన్సీపీకి పట్టు లేదు. పట్టించుకోవడంలేదని లేదు. అందుకే కాంగ్రెస్ దాదాపుగా ఒంటరిగా మిగిలింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో స్వతంత్రంగా లేదా చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. ముస్లిం , దళిత ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. జనవరి 15న జరగనున్న పోలింగ్ , 16న వెలువడే ఫలితాలు ముంబై భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.


