ముంబైలో 500 SFT ఇల్లు కోటికిపైగా ఉంటుంది. కానీ అదే ముంబైలో అపార్టుమెంట్ వాసులకు ఉండటానికి ఇల్లు ఇచితంగా రాడవమే కాదు.. అదనంగా కోటి రూపాయలు కూడా ఇస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ముంబై రియల్ ఎస్టేట్‌లో ఇది నిజంగా జరుగుతోంది.
సాధారణంగా అపార్ట్మెంట్లలో నివసించే వారు ప్రతి నెలా మెయింటెనెన్స్ కోసం జేబులోంచి డబ్బులు తీసి సొసైటీకి కట్టడం మనకు తెలుసు. కానీ ముంబైలోని వర్లీలో ఉన్న సాగర్ ఉపవన్ ‘ హౌసింగ్ సొసైటీలో కథ అడ్డం తిరిగింది. ఇక్కడ నివాసితులే సొసైటీ నుంచి లక్షల రూపాయలు వెనక్కి తీసుకుంటున్నారు. ముంబై లాంటి ఖరీదైన నగరంలో సొంత ఇంట్లో ఉంటూనే రివర్స్ పేమెంట్ అందుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్.
ఈ వింతైన లాభానికి కారణం రీ డెవలప్మెంట్ ఒప్పందం. పాతబడిన ఈ అపార్ట్‌మెంట్‌ను ఆధునీకరించే క్రమంలో ఒక ప్రముఖ బిల్డర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నివాసితుల పాలిట కల్పవృక్షమైంది. తమ పాత ఇళ్లను వదులుకున్నందుకు ప్రతిఫలంగా, కార్పస్ ఫండ్ రూపంలో ఒక్కో ఫ్లాట్ యజమానికి రూ. 50 లక్షల నుండి ఏకంగా రూ. 1 కోటి వరకు నగదు లభించింది. అంటే, కొత్త ఇల్లు చేతికి రాకముందే వారు లక్షాధికారులుగా మారిపోయారు.
కేవలం భారీ నగదు మాత్రమే కాదు, కొత్త టవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు నివాసితులు పడే ఇబ్బందులను కూడా బిల్డరే నగదు రూపంలో తీరుస్తున్నారు. ముంబైలో అద్దెలు భరించలేనంతగా పెరిగిపోయిన తరుణంలో, బిల్డర్ ప్రతి నెలా లక్ష రూపాయలకు పైగా అద్దె అలవెన్స్‌ను అందిస్తున్నారు. దీనికి తోడు, భవిష్యత్తులో వీరికి దక్కబోయే కొత్త ఫ్లాట్లు గతంలో ఉన్న వాటికంటే ఎక్కువ విస్తీర్ణంతో, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఉచితంగా లభించనున్నాయి.
ముంబైలో స్థలం కొరత కారణంగా పాత సొసైటీలన్నీ ఇప్పుడు ఇదే బాటలో నడవాలని ఆశిస్తున్నాయి. అయితే, సాగర్ ఉపవన్ ప్రైమ్ లొకేషన్ కీలకం. సొంత ఇంటిపై రూపాయి ఖర్చు చేయకుండానే భారీ నగదు సంపాదించడం అనే ఈ కొత్త కాన్సెప్ట్, పాత అపార్ట్మెంట్లలో ఉండేవారికి ఇప్పుడు సరికొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
