‘మహానటి’ టైమ్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని ఇంటికి పిలిచి.. తన అభినందనలు తెలిపారు. నిర్మాత అశ్వనీదత్ తో చిరుకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే మహానటి విజయాన్ని మెగాస్టార్ సెలబ్రేట్ చేశారు. అదే సమయంలో నాగ అశ్విన్ పనితనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకొన్నారు. ఆ సందర్భంలోనే చిరంజీవి – నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తానంటూ అశ్వినీదత్ ప్రకటించారు. ‘పాతాళ భైరవి’ లాంటి సినిమా ఈ కాంబోలో రాబోతోందంటూ ఊరించారు. నాగ అశ్విన్ అలాంటి కథలు తెరకెక్కించడంలో సమర్థుడే కాబట్టి… ‘పాతాళ భైరవి’ లాంటి సినిమా కచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందని అంతా అనుకొన్నారు. కానీ ఆ తరవాత.. ఆ ఊసే లేకుండా పోయింది. నాగ్ అశ్విన్ ‘కల్కి’ వరల్డ్ లో బిజీ అయిపోయారు. చిరు ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్లీ సుదీర్ఘ విరామం తరవాత నోరు విప్పారు నాగ అశ్విన్. ‘సింగ్ గీతం’ సినిమాకు సంబంధించి తెలుగు 360 తో ప్రత్యేకంగా మాట్లాడారు నాగ అశ్విన్. ఈ సందర్భంగా పాతాళ భైరవి ప్రస్తావన వచ్చింది. “అప్పట్లో అనుకొన్న ఆ ప్రాజెక్ట్ ఏమైంది” అని ప్రశ్నించినప్పుడు “అప్పుడు అనుకొన్నాం. కానీ కథ సిద్ధం కాలేదు. నేను కల్కి వరల్డ్ లో పడిపోయాను. పాతాళ భైరవి అంటే నాకు చాలా ఇష్టం. ఆ జోనర్లో ఎప్పుడు సినిమా తీసినా బాగానే ఉంటుంది” అని ముక్తాయించారు. సో.. చిరుతో పాతాళ భైరవి ఆశలకు పుల్ స్టాప్ పడిపోయినట్టే. కాకపోతే..ఆ తరహా కథని నాగ్ అశ్విన్ ఎప్పటికైనా తెరకెక్కిస్తారన్న నమ్మకం అయితే ఉంది. ప్రస్తుతం ‘కల్కి 2’ పనుల్లో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారు.
