బాలీవుడ్ లో విడుదలైన ‘దురంధర్’ దుమ్ము దులిపేసింది. రూ.1000 కోట్లకు పైగానే ఈ సినిమా వసూళ్లు అందుకొంది. ఇప్పుడు ఓటీటీలోనూ విడుదలైంది. థియేటర్లో చూడని వాళ్లు సైతం.. ఇప్పుడు ఓటీటీలో చూసి ‘మంచి సినిమా’ అంటూ మెచ్చుకొంటున్నారు. ఈ సినిమాలోని నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ డెకాయిట్ పాత్ర అయితే బ్లాస్ట్ లా పేలింది. రెహమాన్ గా అక్షయ్ ఆహార్యం, అభినయం బాగా నచ్చాయి. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా నాగార్జునను సంప్రదించినట్టు సమాచారం. అయితే నాగ్ ఒప్పుకోలేదు. ఆ స్థానంలో ‘కూలీ’ సినిమాను ఒప్పుకొన్నారు. ‘కూలీ’ ఇచ్చిన రిజల్ట్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘దురంధర్’ విడుదలయ్యాక.. నాగ్ నిర్ణయం ఎంత తప్పయ్యిందో తెలిసొచ్చింది. నాగ్ ఈ సినిమాని వదిలేసి తప్పు చేశాడని ఆయన అభిమానులు కూడా బాధ పడుతున్నారు.
నిజానికి నాగ్ స్ట్రాటజీ వేరు. ‘కూలీ’ రజనీకాంత్ సినిమా. పైగా లోకేష్ కనగరాజ్ తనని తాను ప్రూవ్ చేసుకొన్న దర్శకుడు. కాబట్టి గుడ్డిగా నమ్మొచ్చు. కాంబో పరంగా ‘దురంధర్’ కంటే ‘కూలీ’కే క్రేజ్ ఎక్కువ. అందుకే నాగ్ కూడా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
‘దురంధర్’ సినిమా చూశాక.. ఇలాంటి సినిమా తెలుగులో తీస్తే హీరోగా ఎవరు బాగుంటారన్న చర్చ మొదలైంది. ఎన్టీఆర్ అభిమానులు ‘వార్ 2’లాంటి సినిమాకు బదులు తమ హీరో ఇలాంటి కథ ఎంచుకొంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రణవీర్ సింగ్ లుక్స్ ని రామ్ చరణ్ లుక్స్ తో పోలుస్తూ కొంతమంది మెగా అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మొత్తానికి ‘దురంధర్’ టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.


