దసరా రోజున విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’కి మంచి వసూళ్లు లభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబరు 1నే ప్రీమియర్లు పడ్డాయి. దాదాపు 90 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా, `బాయ్ కాట్ కాంతార` అనే నినాదం సోషల్ మీడియాలో కనిపించినా ఓపెనింగ్స్ ని మాత్రం అడ్డుకోలేకపోయాయి. దానికి తోడు రివ్యూలు సైతం బాగానే వచ్చాయి. పండగ సీజన్ ప్లస్ అయ్యింది. ఎలా చూసినా కాంతార చాప్టర్ 1కి తెలుగులో మంచి ఆదరణ దక్కుతున్నట్టే.
ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని నాగవంశీ ముందు నుంచీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం…. ఆయన త్వరలో రిషబ్ శెట్టితో ఓ సినిమా ప్లాన్ చేశారు. అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించనున్నారు. రిషబ్ పై తెలుగులో అంత పెద్ద సినిమా వర్కవుట్ అవుతుందా, లేదా? అనేది ఆయన భయం. కానీ `కాంతార 1`కి తెలుగులో వచ్చిన స్పందనతో ఆయన హ్యాపీ అయి ఉంటారు. `కాంతార చాప్టర్ 1` తరవాత రిషబ్ నుంచి వచ్చే రెండు సినిమాల్ని తెలుగు దర్శకులే టేకప్ చేస్తుండడం విశేషం. `జై హనుమాన్`లోనూ రిషబ్ శెట్టినే కథానాయకుడు అనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలెడతారు. నాగవంశీ సినిమా స్క్రిప్టు వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్‌కి చాలా టైమ్ తీసుకొనే అవకాశం ఉంది. `జై హనుమాన్` కు సంబంధించి రెండు షెడ్యూళ్లు అయ్యాక… నాగవంశీ సినిమా మొదలయ్యే ఛాన్సుంది.