నాగార్జున ఇమేజ్ ఛట్రం నుంచి బయటకి రావాలని బలంగా ఫిక్స్ అయ్యారు. హీరోగా సినిమాలు చేస్తూనే బలమైన పాత్రలు ఉంటే చేయడానికి రెడీగా ఉన్నారు. కుబేర అలా వచ్చిన సినిమానే. ఈ సినిమాలో నాగార్జున పెర్ఫార్మెన్స్కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి కూలీ సినిమా రాబోతుంది. నాగ్ విలన్‌గా చేసిన మొదటి సినిమా ఇది. ఈ పాత్రలో ఆయన్ని ఒప్పించడానికి దర్శకుడు లోకేష్ దాదాపు ఆరు నెలల శ్రమించాల్సి వచ్చింది. ఏడుసార్లు నరేషన్స్ ఇచ్చారట. నాగార్జున కొన్ని మార్పులు కూడా చెప్పారు. ఆ మార్పులకు లోకేష్ అంగీకరించిన తర్వాత కూలీ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు నాగ్.
అయితే కూలీలో తన క్యారెక్టర్ విషయంలో నాగార్జున కాస్త ముందు చూపుతోనే వ్యవహరించారు. కుబేర సినిమా సమయంలో నాగార్జున ఓ విమర్శను ఎదుర్కొన్నారు. కుబేరకి హిట్ టాక్ వచ్చిన తర్వాత జరిగిన సక్సెస్ మీట్లో ”శేఖర్ కమ్ముల ఈ కథ చెప్పినప్పుడు కుబేర నా కథే అనిపించింది. నేనే సెంటర్ పాయింట్” అని నాగ్ చెప్పడం ట్రోలింగ్‌కు దారి తీసింది. సినిమాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత నాగార్జున క్రెడిట్ మొత్తం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. దీంతో నాగార్జున ”ఇది దీపక్ సినిమా, దేవా సినిమా” అంటూ క్యారెక్టర్స్‌కి క్రెడిట్ ఇచ్చి తన స్టేట్మెంట్ను సరిదిద్దారు.
ఇప్పుడు కూలీ విషయానికి వస్తే… ఇందులో ఆల్మోస్ట్ హీరో లాంటి క్యారెక్టర్ చేశానని విడుదల ముందే తన వైపు నుంచి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నాగ్. కూలీ కథ అంతా సైమన్ క్యారెక్టర్ చుట్టూ ఉంటుందని చెప్పారు. ఇక రజనీకాంత్ కూడా సైమన్ క్యారెక్టర్‌కే ఎక్కువ మార్కులు వేస్తారు. లోకేష్ కథ చెప్పినప్పుడు నాకు సైమన్ క్యారెక్టర్ చేయాలనిపించిందని, కథలో ఆ క్యారెక్టర్ అంత స్టైలిష్, పవర్‌ఫుల్‌గా వుందని చెప్పారు రజనీ. ఈ రకంగా నాగార్జున క్యారెక్టర్ పై చాలా హైప్ వచ్చింది. మరి కెరీర్లో ఫస్ట్ టైం విలన్ రోల్ ప్లే చేస్తున్న నాగార్జునకి కూలీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.