మార్చి 26న రావాల్సిన సినిమా ‘పారడైజ్’. ఈ సినిమా వాయిదా పడుతుందని ముందు నుంచీ అర్థమవుతూనే ఉంది. అనుకొన్నట్టుగానే ‘పారడైజ్’ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 21న ఈ సినిమాని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. ఆగస్టు 21 అనేది జాక్ పాట్ డేట్. 21 శుక్రవారం. 22, 23.. వీకెండ్ ఎలాగూ కలిసొస్తుంది. 26 మీలాదునబి సెలవు దినం. 28న రాఖీ పండగ సెలవు. సెప్టెంబరు 4న జన్మాష్టమి సెలవు.. ఇలా రెండో వారం, మూడో వారం కూడా సెలవుల్ని క్యాష్ చేసుకొనే అవకాశం ఉంది. నాని సినిమాకు మంచి టాక్ వచ్చి, రెండో వారం కూడా ఫుట్ ఫాల్స్ బాగుంటే, ఈ హాలిడేస్ బాగా కలిసొస్తాయి. అందుకే అన్ని విధాలుగా చూసుకొని, ఆగస్టు 21న సినిమాని ఖరారు చేసుకొన్నారు.
నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని విడుదల చేస్తున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందించారు. ఈ పాటకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఈ సినిమాపై దాదాపు రూ.120 నుంచి రూ.150 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. నాని కెరీర్ లో అతి ఖరీదైన సినిమా ఇదే. మోహన్ బాబు విలన్ గా నటించారు. ఆయన పారితోషికం రూ.5 కోట్లని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఈ సినిమా తరవాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తారు. అందుకే చిరు కూఆ ఈ సినిమా రిజల్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
