హెరిటేజ్ ఫుడ్స్ అధినేత నారా భువనేశ్వరి డైరీ రంగంలో చేస్తున్న విశేష కృషికి గానూ మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్ జోన్ ఆమెను అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారం ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది డైరీ రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
తన తల్లికి దక్కిన ఈ గౌరవంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు. అభినందనలు అమ్మ! డెయిరీ రైతుల సాధికారత కోసం, దేశీయ డైరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు నీవు చేస్తున్న కృషి నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తుంది. ఈ పురస్కారం నీ కష్టానికి దక్కిన సరైన గుర్తింపు. కొడుకుగా నేను ఎంతో గర్వపడుతున్నాను అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. లోకేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గర్వంగా ఉందని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
నారా భువనేశ్వరి నేతృత్వంలో హెరిటేజ్ సంస్థ డైరీ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, పశువుల ఆరోగ్యం , పాల నాణ్యత పెంచేందుకు సాంకేతికతను జోడించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. రైతుల అభ్యున్నతి కోసం ఆమె పడుతున్న తపనకు ఈ అవార్డు నిదర్శనమని రాజకీయ , పారిశ్రామిక ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
