మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కోవాబన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన ఒక ముస్లిం వ్యాపారిపై కొందరు యూట్యూబర్లు చేసిన ఓవరాక్షన్ సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలకు దారితీసింది. మతపరమైన కోణంలో ఆ వ్యాపారిని ప్రశ్నిస్తూ, అతడిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు సదరు యూట్యూబర్ల తీరును తప్పుబడుతున్నారు. కష్టపడి పని చేసుకునే వ్యక్తిని ఇలా వేధించడం సరికాదంటూ అతనికి మద్దతుగా పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు.
ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. కష్టపడి జీవిస్తున్న ఒక సామాన్య వ్యాపారిపై జరిగిన వివక్ష నన్ను ఎంతో బాధించిందని.. తెలుగు నేల ఎప్పుడూ సామరస్యానికి ప్రతీక అని అన్నారు. త్వరలోనే మిమ్మల్ని స్వయంగా కలుస్తాను.. మీ ఫేమస్ కోవాబన్ను నేను కూడా రుచి చూస్తాను అని భరోసా ఇచ్చారు. నారా లోకేష్ ఈ ట్వీట్ లో కోవాబన్ రుచి చూస్తా అని పెట్టడం ప్రత్యేకంగా ఉంది.
ఎందుకంటే అతను అమ్మే బన్ పది రూపాయలు. కోవాబన్ చేయడం పది రూపాయలతో సాధ్యం కాదని కల్తీ పదార్ధాలతో క్వాలిటీ లేకుండా చేసి అమ్ముతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కొంత మంది ఇదే లాజిక్ చూపిస్తున్నారు. అందుకే అలాంటి అనుమానాలు అన్నీ కేవలం అపోహలేనని లోకేష్ స్వయంగా వలీ తయారు చేసే కోవాబన్ను తింటానని చెప్పారు.
ఒక సామాన్య వ్యక్తికి మంత్రి స్థాయి వ్యక్తి ఇలా నేరుగా మద్దతు ప్రకటించడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ల ఓవరాక్షన్ తో కోవాబన్ వ్యాపారి రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. చాలా మంది ప్రముఖులు, సామాన్యులు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. నారా లోకేష్ స్పందనతో ఈ అంశం జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. పని చేసే వాడికి కులం, మతం ఉండదని, శ్రమకు గౌరవం దక్కాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.