దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలోని లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మనుగడపై అలుముకున్న నీలినీడలు తొలగిపోయాయి. ఎఫ్.సి.ఆర్.ఏ అనుమతులు లభించక, విదేశీ నిధులు నిలిచిపోయి సంస్థ సేవలు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. ఆర్డీటీ అంటే కేవలం ఒక సంస్థ కాదు.. అది పేదల బతుకుల్లో ఆశాకిరణం అని నమ్మిన లోకేష్, ఆనాడు మాంఛో ఫెర్రర్‌కు ఇచ్చిన హామీని నేడు అక్షర సత్యం చేస్తూ, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలా కృషి చేశారు.
గత ఏడాది కాలంగా ఆర్డీటీ సంస్థపై కేంద్రానికి మతమార్పిడి ఫిర్యాదులు వెళ్లాయి. అదే సమయంలో నిధుల వినియోగం, సేకరణలో కొని అభ్యంతరాలూ వచ్చాయి. దీంతో. ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ను కేంద్రం పొడిగించలేదు. అయితే క్షేత్రస్థాయిలో ఆ సంస్థ అందిస్తున్న విద్య, వైద్య, సామాజిక సేవలను ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వానికి, ముఖ్యంగా లోకేష్‌కు ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన ఫైలు వ్యవహారం కాదు. వేలాది మంది అనాథల భవిష్యత్తు, పేద రోగుల ప్రాణాలు, వందలాది గ్రామాల ఆర్థిక సాధికారతతో ముడిపడి ఉన్న అంశమని గుర్తించి, రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఢిల్లీ పర్యటనల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, ఆర్డీటీ చేస్తున్న నిస్వార్థ సేవలను, అది కేవలం మానవతా దృక్పథంతోనే సాగుతోందని గణాంకాలతో సహా వివరించారు. ఆ సంస్థపై వచ్చినవి తప్పుడు ఫిర్యాదులేనని మత మార్పిళ్లకు ప్రోత్సహించడంలేదని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఆర్డీటీకి క్లీన్ చిట్ లభించేలా చేయడంలోనూ, ఆ సంస్థపై ఉన్న అపోహలను తొలగించడంలోనూ లోకేష్ స్వయంగా పర్యవేక్షించి, మాంఛో ఫెర్రర్‌కు కొండంత అండగా నిలిచారు.
కేంద్ర హోంశాఖ ఎఫ్.సి.ఆర్.ఏ అనుమతులు మంజూరు చేయడంతో కార్యకలాపాలు యధావిధిగా సాగనున్నాయి. అనాడు ఫాదర్ ఫెర్రర్ నాటిన సేవా వృక్షం వాడిపోకుండా కాపాడిన లోకేష్ ప్రయత్నాలను ప్రజలు అభినందిస్తున్నారు.


