అర్థరాత్రి నారా లోకేష్‌ను కేటీఆర్ కలిశారని.. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో మద్దతు కోసం ప్రయత్నించారని ..ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అర్థరాత్రి పూట లోకేష్‌ను కలవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. నారా లోకేష్ ను అర్థరాత్రి కలవలేదు కానీ.. కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఈ వివాదం పై తాజాగా నారా లోకేష్ స్పందించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌ను కలవడానికి రేవంత్ అనుమతి కావాలా ?
కేటీఆర్‌ను కలుస్తానని ఎందుకు కలవకూడదని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో కేటీఆర్ ను కలిశామన్నారు. కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్‌రెడ్డిని అడగాలా అని కూడా ప్రశ్నించారు. నారా లోకేష్ అన్న మాటలతో కేటీఆర్ ఇజ్జత్ నిలబడుతుంది. తనను కలిసేందుకు కేటీఆర్ ప్రయత్నించారని లేకపోతే ఎన్నికలపై మాట్లాడేందుకు కలిశారని చెప్పి ఉంటే కేటీఆర్ ఇజ్జత్ మూసిలో కలసిపోయి ఉండేది. కానీ నారా లోకేష్ చాలా తెలివిగా ఈ విషయాన్ని రాజకీయం చేసిన రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
అడ్వాంటేజ్ తీసుకోని నారా లోకేష్
అదే సమయంలో ఆయన కవిత అంశంపైనా స్పందించారు. కవితను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని… టీ టీడీపీ పగ్గాలు ఇస్తారని ఓ వర్గం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. కవితను టీడీపీలో తీసుకోవడమంటే జగన్‌ను చేర్చుకున్నట్టేనని.. ఆ దిశగా తమకు ఎలాంటి ఆలోచనలు లేవని.. బీఆర్ఎస్ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. నారా లోకేష్.. కుటుంబాల్లో చిచ్చు పెట్టే ఇలాంటి రాజకీయాలకు దూరమని సంకేతాలు పంపారు. బీఆర్అస్ ఉన్న దీన స్థితిని అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకోలేదు.
కానీ కేటీఆర్ టీడీపీకి చేసింది చిన్న ద్రోహాలు కాదు !
నిజానికి టీడీపీ పట్ల, చంద్రబాబు పట్ల కేటీఆర్ వ్యవహరించిన విధానాన్ని గుర్తు చేసుకున్న వారికి.. కేటీఆర్ కు ఇలా కాదని.. మరో లా సమాధానం ఇవ్వాలని అనుకుంటారు. కేటీఆర్ నిజంగా జరిగాయో లేదో కానీ.. హరికృష్ణ చనిపోయినప్పుడు పొత్తుల గురించి మాట్లాడారని ఆరోపించారు. తర్వాత జగన్ తో జట్టు కట్టి టీడీపీని ఓడించారు. టీడీపీ నేతలపై కుట్రలు చేశారు. డేటా చోరీ పేరుతో టీడీపీ యాప్ పై భయంకరమైన కుట్రలు చేశారు. అన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని అందరికీ తెలుసు. చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్ వ్యవహరించిన విధాన ఇంకా ఘోరంగా ఉంది.
అయినా నారా లోకేష్.. కొన్ని విషయాల్లో వారి ఇజ్జత్ ను కాపాడాలనే నిర్ణయించుకుని స్పందించారు. కేటీఆర్ చేసినట్లుగా చేస్తే.. ఆయనకూ కేటీఆర్‌కు తేడా ఏముంటుంది ?. రాజకీయాన్ని రాజకీయంగానే చేయడం.. వ్యక్తిగత కుట్రలు చేయకపోవడం చంద్రబాబు నుంచి లోకేష్ నేర్చుకుని ఉంటారు.