పెహల్గాం ఉగ్రదాడిలో తర్వాత భారత్ , పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. యుద్ధం ఖాయమన్నట్లుగా రెండు దేశాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. భారత్ యుద్ధం ప్రకటించడం ఖాయం అని డిసైడర్ అయిన పాకిస్తాన్ .. తాను కూడా రెడీ అన్న సంకేతాలు పంపింది. ఆయుధాలు రెడీ చేసింది. అణుబాంబులు వేస్తామని బెదిరిస్తోంది. కానీ భారత్ ఇప్పటికే యుద్ధం ప్రారంభించిన విషయం మాత్రం గుర్తించలేకపోతోంది.
ఇప్పటికే పాకిస్తాన్ ను ఒంటరి చేస్తున్న ప్రధాని మోదీ
పాకిస్తాన్ పై ఇప్పటికే మోదీ యుద్ధం ప్రకటించారు. ప్రారంభించారు. కొనసాగిస్తున్నారు. యుద్ధం అంటే ఆధునిక కాలంలో బాంబులు వేయడం కాదు. ప్రత్యర్థిని ఓడించడం. యుక్తి .. శక్తి ద్వారా ప్రత్యర్థిని నిర్వీర్యం చేయడం ఇప్పుడు మోదీ అదే చేస్తున్నారు. పాకిస్తాన్ ను ఒంటరి చేస్తున్నారు. భారత్ యుద్ధం చేసేది ఉగ్రవాదంపైనేనని ప్రపంచానికి సందేశం ఇచ్చారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో.. పాకిస్తాన్ భూభాగంలో పాక్ ఆర్మీ సాయంతో నక్కిన ఉగ్రవాదుల్ని.. వారి క్యాంపులపై మాత్రమే యుద్ధం చేస్తుందని.. దేశంపై దండెత్తడం లేదని అందరికీ చెబుతున్నారు.
పాకిస్తాన్ కు మద్దతిస్తే ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లే !
పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి కూడా ప్రకటించారు. ఇప్పుడుకొత్తగా ఆ దేశంపై ఉగ్రవాద ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ కు ఏ దేశం మద్దతిచ్చిన ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లే. చైనా కూడా అంతే. చైనా మద్దతుతో భారత్ ఉగ్రవాదులపై తీసుకునే చర్యలను ప్రతిఘటించాలనుకుంటే.. ఉగ్రవాదులకు మద్దతుగా రంగంలోకి దిగాలని పాకిస్తాన్ అనుకుంటే అప్పుడు అసలు యుద్ధం అనివార్యమవుతుంది. భారత్ శాంతి కాముక దేశం. ఉద్దేశపూర్వకంగా ఎవరి జోలికి వెళ్లదు. 1971లో అయినా..కార్గిల్ వార్ సమయంలో అయినా పాకిస్తాన్ పిచ్చి చేష్టల వల్లనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పట్లో పరిమిత వనరులతోనే లక్షల మంది పాక్ సైన్యాన్ని బందీలుగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే .. భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. ఆస్తి నష్టం జరుగుతుంది. భారత్ కు జరిగే నష్టాన్ని ఆపేందుకు మోదీ. భిన్నమైన వ్యూహంతో వెళ్తున్నారు.
భారత్ కు నష్టం జరగకుండా యుద్ధం !
యుద్ధం ఎలాంటిదైనా రెండు వైపులా నష్టం ఉంటుంది. దానికి తాజా సాక్ష్యం రష్యా, ఉక్రెయిన్ . అలాంటి యుద్ధం ప్రధాని మోదీ కోరుకోవడం లేదు. భారత్ కు .. భారత ప్రజలకు చిన్న నష్టం జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రక్రియలో అసలు యుద్ధం ప్రారంభమయింది. పాకిస్తాన్ ఒంటరి అవుతోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తించలేకపోతోంది.