‘స్వయం కృషి’తో మెగాస్టార్ గా మారిన చిరంజీవి ప్రయాణం చాలామందికి స్ఫూర్తి. చిత్రసీమలో చాలామంది హీరోలు చిరంజీవిని, ఆయన ప్రయాణాన్నీ స్ఫూర్తిగా తీసుకొని కెమెరా ముందుకు వచ్చారు. రవితేజ, శ్రీకాంత్… ఇలా ఎంతోమంది సామాన్యులు హీరోలుగా మారడం వెనుక చిరు రగిలించిన ప్రేరణ వుంది. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా అదే విషయం చెబుతున్నాడు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన తనకు హీరో అవ్వాలనే ఆశ ఉండేదని, అయితే తన ప్రయాణానికి మాత్రం మెగాస్టారే స్ఫూర్తి అంటున్నాడు. చాలాసార్లు వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని అనిపించేదని, కానీ చిరంజీవి ప్రయాణాన్ని చూసి ప్రేరణ పొంది, పోరాటం సాగించానని ‘అనగనగా ఒక రాజు’ సెలబ్రేన్ మీట్ లో నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చాడు. నవీన్ చిరు నామ స్మరణ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇది వరకు చాలా ఇంటర్వ్యూలలో మెగాస్టార్ పైన తనకున్న ప్రేమని కురిపిస్తూనే ఉన్నాడు.
మెగాస్టార్ ని చూసి, స్ఫూర్తి పొంది, సినిమాల్లోకి వచ్చి, హిట్లు కొట్టడమే కాకుండా, ఈ సంక్రాంతికి చిరు సినిమాతో పాటుగా తన సినిమానీ రిలీజ్ చేసి, మరో విజయం తన ఖాతాలో వేసుకొన్నాడు. ”ఓవైపు బాస్ సినిమా, మరో వైపు నీ సినిమా కలక్షన్లు కురిపిస్తున్నాయి.. అని డిస్టిబ్యూటర్లు చెబుతుంటే ఆనందంగా ఉంది” అంటూ పొంగిపోతున్నాడు నవీన్. అన్నట్టు నవీన్ అంటే చిరుకీ ఇష్టమే. తన కామెడీ టైమింగ్ ని ఆయన బాగా ఇష్టపడుతుంటారు. ఈ జనరేషన్ హీరోల్లో చిరుకి బాగా నచ్చిన హీరో నవీన్. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ ఇదే వేదికపై వెల్లడించారు. నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాకు స్ఫూర్తి ‘చంటబ్బాయ్’ కావడం గమనించుకోవాల్సిన విషయం. వీరిద్దరూ కలిసి ఓసినిమా చేస్తే బాగుంటుందని, అది కూడా చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కలిసి కనిపిస్తే ఇంకా బాగుంటుందన్నది అభిమానుల కోరిక. నిజంగానే ఈ కాంబో వర్కవుట్ అయితే చూడ్డానికి బాగుంటుంది.
