అమరావతి నుంచి ఎంపీగా గెలిచిన బాలయ్య హీరోయిన్..!

నవనీత్ కౌర్… ! ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు… ఎక్కడో చూసినట్లు ఉందే..అనిపించే పేరు. 2004 నుంచి 2010 వరకూ… చిన్న చిన్న సినిమాల్లో చాలా వాటిలో హీరోయిన్‌గా చేసింది. మహారథి అనే సినిమాలో బాలకృష్ణ పక్కన కూడా హీరోయిన్‌గా చేసింది. కానీ.. సక్సెస్ రాలేదు. చివరికి ఓ మహారాష్ట్ర రాజకీయ నేతను చేసుకుని అక్కడ సెటిలైపోయింది. ఇప్పుడు హఠాత్తుగా.. ఆమె… ఎంపీ అయిపోయింది. అదీ కూడా అమరావతి నుంచి. అయితే.. ఆమె ఎంపీ అయింది.. ఏపీలోని అమరావతి నుంచి కాదు..మహారాష్ట్రలోని అమరావతి నుంచి…!

జగపతి,మహారధి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నవ్‌నీత్‌ కౌర్‌..మహారాష్ట్ర రాజకీయాల్లో ఇపుడో సంచలనం. యమదొంగ సినిమా వంటి సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌లోనూ అదరగొట్టారు నవ్‌నీత్‌ కౌర్‌. అయితే తెలుగు సినిమాల్లో అలరించిన ఈ మరాఠి నటి.. తర్వాత మహారాష్ట్ర ఎమ్మెల్యేను పెళ్లి చేసుకుంది. బద్‌నేరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్తిగా గెలిచిన రవి రాణాతో నవ్‌నీత్‌ కౌర్‌ పెళ్లి అయింది. పెళ్లికి ముందు సినిమాల్లో బిజీగా ఉన్న కౌర్‌… పెళ్లి తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఎమ్మెల్యే భర్త సాహచర్యంలో రాజకీయాల్లో ఆరితేరిన నవ్‌నీత్‌… ఇపుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అమరావతి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి యువ స్వాభిమాన్‌ పార్టీ తరపున పోటీ చేశారు. విజయం సాధించారు. కానీ ఈ పార్టీకి గుర్తింపు లేదు కాబట్టి.. ఇండిపెండెంట్‌గానే గుర్తిస్తున్నారు.

అమరావతి.. మహారాష్ట్రలోని కీలక నియోజకవర్గం. అక్కడ శివసేన అభ్యర్థి నుంచి ఆనంద్‌రావు ఐదుసార్లు గెలిచారు. అలాంటి చోట.. సత్తా చాటారు నవ్‌నీత్‌ కౌర్‌. భర్త రాజకీయ అనుభవంతో పాటు… కాంగ్రెస్‌ సారథ్యంలోని పక్షాలు ఆమెకు మద్దతు పలికాయి. దీంతో ఆమె 30 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ నవ్‌నీత్‌కౌర్‌కు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి. ఇక నవ్‌నీత్‌ కౌర్‌ పార్లమెంట్‌లో ఎంపీగా తన గళం వినిపించనున్నారు. సినిమాల్లో అదరగొట్టిన ఆమె..ఇపుడు పార్లమెంట్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

బీజేపీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేశారు. గెలిచారు కూడా. హేమమాలిని, సన్నిడియోల్, రవికిషన్, కిరణ్ ఖేర్ సహా.. చాలా మంది.. ఈ సారి పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. అనూహ్యంగా… ఆ బీజేపీని ఎదుర్కొని… చిన్న హీరోయిన్‌ అయిన నవనీత్ కౌర్…. ఘన విజయం సాధించారు. అదీ కూడా.. ప్రధానమైన పార్టీ తరపున కాకుండా.. తన భర్త పెట్టుకున్న చిన్న పార్టీ నుంచి విజయం సాధించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com