హిట్ కాంబినేషన్‌ని రిపీట్ చేయాలంటే టాలీవుడ్ కి భలే మక్కువ. మరీ ముఖ్యంగా హిట్ పెయిర్ని మళ్లీ మళ్లీ చూపించాలనుకొంటారు. బాలకృష్ణ – నయనతార కూడా అలాంటి కాంబినేషనే. ‘శ్రీరామరాజ్యం’, ‘సింహా’, ‘జై సింహా’ చిత్రాలతో అలరించిన జంట ఇది. ఈ మూడు చిత్రాలూ విజయం అందుకొన్నాయి. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కోసం రంగం సిద్ధం చేసుకొన్నారు.
నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా నయనతారని ఎంచుకొన్నట్టు ఇది వరకే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ కాంబో ఖాయమైంది. నయనతారని కథానాయికగా అధికారికంగా ప్రకటించేశారు. ఈరోజు నయనతార పుట్టిన రోజు. ఈ సందర్భంగా… నయనకు స్వాగతం పలుకుతూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నయన పాత్రకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. నయన లుక్ చూస్తే… వీరనారిగా ఆమె పాత్రని తీర్చిదిద్దబోతున్నట్టు అర్థమవుతోంది. శ్రీరామరాజ్యం మినహా మిగిలిన రెండు చిత్రాల్లో నయన పోషించింది కమర్షియల్ కథానాయిక పాత్రలే. ఈసారి మాత్రం చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో కనిపించబోతోంది. స్క్రిప్టు వర్క్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.