రివ్యూ: నీవెవ‌రో

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

సినిమా.. క్రికెట్. ఈ రెండూ ప్రేక్ష‌కుడికి వినోదాన్నే అందిస్తాయి. బ్యాటింగ్ ఎంత నిదానంగా సాగుతున్నా… వ‌రుస వికెట్లు ప‌డుతున్నా, రెండు సిక్స‌ర్లు ప‌డితే అంతా స‌ర్దుకుంటుంద‌నీ, కొహ్లీ లాంటి ఆట‌గాడు రెచ్చిపోతే స్కోరు బోర్డు ప‌రుగులు పెట్ట‌డం ఖాయం అనుకుంటూ చివ‌రి వ‌ర‌కూ ఆశ‌తో క్రికెట్ చూస్తాడు ప్రేక్ష‌కుడు. కానీ సినిమాకి ఆ వెసులుబాటు ఉండ‌దు. నాలుగైదు స‌న్నివేశాలు బోర్ కొట్టించాయంటే సీట్లో నుంచి లేచిపోతాడు. ఆ త‌ర్వాత సినిమా ఎంత బాగున్నా అది వృథానే. అంటే క్రికెట్‌లో సిక్స‌ర్లు, బౌండ‌రీలు ఎలాగో… అలా సినిమాలో ఎప్ప‌టిక‌ప్పుడు ర‌క్తిక‌ట్టించే స‌న్నివేశాలు ప‌డుతూనే ఉండాలి. అప్పుడే ప్రేక్ష‌కుడు సీట్లో కుదురుగా కూర్చుంటాడు. ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ల‌కి ఆ ల‌క్ష‌ణం మ‌రింత ముఖ్యం. మ‌రి అదే త‌ర‌హా క‌థ‌తో తెర‌కెక్కిన `నీవెవ‌రో` ఎలా ఉంది.. కోహ్లి బ్యాటింగ్‌లా సాగిందా? లేదంటే మ‌న స‌హ‌నాన్ని ప‌రీక్షించిందా?

* క‌థ‌

ఓ రెస్టారెంట్ ఓన‌ర్ క‌ల్యాణ్ (ఆది పినిశెట్టి ). ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే కంటి చూపును కోల్పోయిన అత‌నికి ఆత్మ‌గౌర‌వం ఎక్కువ‌. చెఫ్‌గా మారి, రెస్టారెంట్‌ని న‌డుపుతూ బాగా డ‌బ్బు సంపాదిస్తుంటాడు. ఇంత‌లో ఇంట్లోవాళ్లు చిన్న‌ప్ప‌ట్నుంచీ స్నేహితురాలైన అను (రితికా)తో క‌ల్యాణ్‌కి పెళ్లి చేయాల‌నుకుంటారు. మ‌రికొన్ని రోజుల్లో పెళ్లి అన‌గా క‌ల్యాణ్‌కి వెన్నెల (తాప్సి) ప‌రిచ‌య‌మ‌వుతుంది. అనుకి త‌న‌పై జాలి మాత్ర‌మే ఉంద‌ని, వెన్నెల త‌న‌ని తానుగానే చూస్తూ ఇష్ట‌ప‌డుతోందని తెలుసుకొని ఆమెని ప్రేమిస్తున్న‌ట్టు చెబుతాడు. వెన్నెల కూడా అందుకు అంగీక‌రిస్తుంది. ఇంత‌లో వెన్నెల ఓ క‌ష్టంలో చిక్కుకుంటుంది. రూ: 20 ల‌క్ష‌ల‌తో ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది కాబ‌ట్టి స‌ర్దుబాటు చేస్తాన‌ని చెబుతాడు క‌ల్యాణ్‌. ఇంత‌లో అత‌ను ఓ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ‌తాడు. క‌ష్టాల్లో ఉన్న వెన్నెల ఆచూకీ తెలియ‌కుండా పోతుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క‌ల్యాణ్‌కి ఓ స‌ర్జ‌రీ త‌ర్వాత కంటిచూపు తిరిగొస్తుంది. ప్ర‌మాదం నుంచి కోలుకున్నాక తానెంత‌గానో ఇష్ట‌ప‌డే వెన్నెల ఆచూకీ తెలుసుకొనేందుకు న‌డుం బిగిస్తాడు. ఈ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? వెన్నెల ఆచూకీ క‌నుక్కున్నాడా లేదా? అస‌లు ఆమెకున్న క‌ష్టం ఏంటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌

కొన్ని కాన్సెప్టులు భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఇలాంటి క‌థ‌ల‌తోనూ సినిమాలు తీయొచ్చా అని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటాయి. `నీవెవ‌రో` కూడా కాన్సెప్టు కూడా అలాంటిదే. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `అదే కంగ‌ల్‌`కి అఫీషియ‌ల్ రీమేక్‌గా రూపొందింది. రీమేక్ అన్న‌ప్పుడు ఒరిజిన‌ల్ సినిమాలోని త‌ప్పొప్పుల్ని కూడా స‌రిచేసుకొనే వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ సినిమా విష‌యంలో మాత్రం మ‌రిన్ని త‌ప్పులే చేశారు త‌ప్ప‌, పాత వాటిని స‌రిదిద్దుకున్న‌ట్టు ఎక్క‌డా అనిపించ‌దు. ఈ క‌థ కుదురుకోవ‌డానికే చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఆరంభ స‌న్నివేశాలు ఆల్మోస్ట్‌గా ఓ డాక్యుమెంట‌రీ టైప్‌లోనే ఉంటాయి. క‌ల్యాణ్ పాత్ర చేసే ఓ ఫైట్‌, తాప్సి ఎంట్రీ త‌ర్వాతే క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. అంటే దాదాపుగా క్రికెట్ ఆటలో స‌గం ఓవ‌ర్లు అయ్యాక ఓ బౌండ‌రీ ప‌డిన‌ట్టుగా ఉంటుంది ఈ సినిమా వాల‌కం. అప్ప‌టిదాకా అంధుడి పాత్ర‌లో ఆది అభిన‌యాన్ని చూసి స్వాంత‌న పొందాల్సిందే త‌ప్ప, క‌థ‌లోనూ, స‌న్నివేశాల్లోనూ ఏమాత్రం కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. క‌ల్యాణ్‌కి యాక్సిడెంట్ జ‌రిగిన త‌ర్వాత క‌థ ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుని తీసుకుంటుంది. కానీ ఆ సంద‌ర్భంలో క‌ల్యాణ్‌కి కంటి చూపు వ‌చ్చే స‌న్నివేశాల్ని స‌హ‌జంగా తీర్చిదిద్ద‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు ద‌ర్శ‌కుడు. అది మంచి ఫీల్ పండే సంద‌ర్భం. కానీ క‌థానాయకుడికి అక్క‌డి నుంచి క‌ళ్లు క‌నిపించాలి కాబ‌ట్టి, క‌ళ్లు వ‌చ్చేలా చేశాం అన్న‌ట్టుగా తీర్చిదిద్దారు స‌న్నివేశాలు. ఇక ద్వితీయార్థంలోనే అస‌లు క‌థ ఉంటుంది.

అయితే వెన్నెల కోసం క‌ళ్యాణ్ వేట మొద‌లుపెడ‌తాడు. ఈ క్ర‌మంలోనే ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెడ‌తాడు. వైజాగ్‌లో మొద‌ల‌య్యే ఆ ఇన్వెస్టిగేష‌న్ ఆరంభం పేల‌వంగా సాగుతుంది. మ‌ళ్లీ అక్క‌డ క‌థ గాడిన ప‌డ‌టానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. స‌ప్త‌గిరి పాత్ర ప‌రిచ‌యం కావ‌డంతో క‌థలో అస‌లు ఇన్వెస్టిగేష‌న్ మొద‌ల‌వుతుంది. అక్క‌డ తెలిసే కొన్ని నిజాలు కాస్త‌లో కాస్త ఉప‌శ‌మ‌నాన్నిస్తాయి. కానీ అప్పటికే ప్రేక్ష‌కుడికి రావాల్సినంత బోరింగ్‌తో పాటు, క‌థ‌లో అస‌లు విల‌న్ ఎవ‌ర‌నేది కూడా ఊహ‌కు అందుతుంది. దాంతో చివ‌ర్లో ఎంత హంగామా సాగినా అదంతా ప్రేక్ష‌కుడికి పెద్ద‌గా వినోదాన్ని పంచ‌దు. స్క్రీన్‌ప్లే ప‌రంగా చిత్ర‌బృందం పెద్ద‌గా శ్ర‌ద్ధ తీసుకోలేదు. దాంతో స‌న్నివేశాలు ఆద్యంతం చ‌ప్ప‌గా సాగుతాయి.

* న‌టీన‌టులు

ఆది, తాప్సిల న‌ట‌నే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆది బ్లైండ్ క్యారెక్ట‌ర్‌లో ఆక‌ట్టుకుంటాడు. చాలా నేచుర‌ల్‌గా న‌టించాడు. కానీ సెకండ్‌హాఫ్‌లో మాత్రం పాత సినిమాల ఆదికీ, ఈ సినిమా ఆదికీ మ‌ధ్య వ్య‌త్యాస‌మేమీ లేదు. తాప్సివ‌ల్లే ఈ సినిమాకి విలువ అని చిత్ర‌బృందం ఎందుకు చెప్పిందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆమె పాత్ర ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కి గురిచేస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంది. సెకండ్‌హాఫ్‌లో వెన్నెల కిషోర్ కామెడీ పండించాడు. కానీ సీరియ‌స్‌గా సాగే ఈ త‌ర‌హా సినిమాల‌కి అలాంటి కామెడీ ఎందుకో అర్థం కాదు. స‌ప్త‌గిరి పాత్ర‌, ఆయ‌న కామెడీ కూడా అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. రితికాసింగ్ అందంతో ఆక‌ట్టుకుంటుంది. ఇక మిగిలిన పాత్ర‌ల గురించి పెద్ద‌గా చెప్పుకోవ‌ల్సిందేమీ లేదు.

* సాంకేతిక‌త‌

కోన వెంక‌ట్‌లాంటి స్టార్ రైట‌ర్ ఈ సినిమా వెన‌క ఉన్న‌ప్ప‌టికీ రైటింగ్ ప‌రంగా పెద్ద‌గా మెరుపులేమీ లేవు. వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, ఆదిల మ‌ధ్య మాట‌ల‌పై చేసినంత క‌స‌రత్తు స్క్రీన్‌ప్లేపై చేసుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేదేమో. ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ ఈ సినిమాని ఎంగేజింగ్‌గా చెప్ప‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. కెమెరా ప‌నిత‌నం, సంగీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి.

* తీర్పు:

ఒక మంచి కాన్సెప్టుతో చేసిన ఓ సాదాసీదా సీదా సినిమా ఇది. ఒక మామూలు క‌థ‌ని కూడా సంక్లిష్టంగా మార్చేసి కాస్త బిగువైన క‌థ‌నంతో చెబుతున్న రోజులివి. కానీ మంచి క‌థ చేతిలో ఉన్నా దాన్ని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో చిత్ర‌బృందం క‌లిసిక‌ట్టుగా విఫ‌ల‌మ‌య్యింది.

* ఫైన‌ల్ ట‌చ్‌: ఎందుకో.. ఏమిటో..

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి... బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే...

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

HOT NEWS

[X] Close
[X] Close