మెగా ఇంటి నుంచి హీరోలే కాదు, నిర్మాతలు కూడా వచ్చారు. నాగబాబు నిర్మాతగా మిశ్రమ ఫలితాల్ని సాధించారు. `ఆరెంజ్` తరవాత మళ్లీ సినిమా తీసే ధైర్యం చేయలేదు. రామ్ చరణ్ తన తండ్రి కోసం కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించారు. ఆ తరవాత సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె మొదట్లో చిన్న సినిమాలు తీశారు. కలసి రాలేదు. చివరికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నిర్మాణంలో పాలు పంచుకొన్నారు. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. సుస్మితకు కొండంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు నిహారిక కూడా నిర్మాతగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఆమె నుంచి వచ్చిన ‘కమిటీ కుర్రాళ్లు’ మంచి విజయం అందుకొంది. ఇప్పుడు ‘రాకాస’ వదులుతున్నారు.
ఈ సినిమాకు రిలీజ్కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఈ సమ్మర్ లో వస్తున్న సినిమాల్లో టేబుల్ ప్రాఫిట్ అందుకొన్న చిన్న సినిమా ఇదే కావడం విశేషం. రిలీజ్ అయ్యాక మంచి బజ్ వస్తే, కచ్చితంగా మంచి లాభాలు చేసుకోవొచ్చు. అందుకే నిహారిక ప్రమోషన్లపై కూడా గట్టిగా దృష్టి పెడుతోంది. బుల్లి తెరపై కూడా నిహారిక బిజీనే. తను ఓ రియాలిటీ షోకి షో రన్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ సంక్రాంతికి మెగా డాటర్ సుస్మిత సూపర్ హిట్టు కొడితే, ఈ వేసవికి ఆ బాధ్యత నిహారిక తీసుకొంది. ‘రాకాస’ బిజినెస్ నిహారికకు మంచి బూస్టప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తోంది. కాకపోతే… అన్నీ చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులే. ఇంట్లో బోలెడంత మంది హీరోలున్నారు. నిర్మాణ రంగంలో కాస్తో కూస్తో అనుభవం సంపాదించిక… నేరుగా మెగా హీరోలతోనే తాను సినిమాలు చేయొచ్చు. ఈలోగా చిన్న సినిమాలతో ట్రైల్ బాల్ ఆడేస్తోంది. ఏప్రిల్ 3న ‘రాకాస’ వస్తోంది. అదే రోజున `బైకర్` రిలీజ్ అవుతోంది. రెండూ డిఫరెంట్ జోనర్లే. కాబట్టి.. ‘పోటీ’ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది.
