వీఎఫ్ఎక్స్ సినిమాలు చూడ్డానికి బాగుంటాయి కానీ, చేయడమే కష్టం. ఆ సినిమాల తాలుకా రిలీజ్ డేట్లన్నీ వీఎఫ్ఎక్స్ కంపెనీలపైనే ఆధారపడి ఉంటాయి. వాళ్ల చేతుల్లోకి సినిమా వెళ్లాక, అది ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పడం చాలా చాలా కష్టం. వీఎఫ్ఎక్స్ తో ముడిపడ్డ చాలా సినిమాలు రిలీజ్ డేట్ వాయిదాలు వేసుకోవడానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరింది. అదే.. ‘స్వయంభూ’. నిఖిల్ సిద్దార్థ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఇదో మైథలాజికల్ డ్రామా. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో రావాల్సిన సినిమా ఇది. అయితే ఇప్పుడు వాయిదా పడింది. ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ వాయిదాకు కారణం.. వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యమే. నిర్మాతలు క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్ 10 మంచి డేటే. వేసవి సెలవల్లో సినిమా విడుదల చేయడం.. నిర్మాతలకు వెసులుబాటు ఉంటుంది. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన సినిమా ఇది. ‘కార్తికేయ 2’ హిట్ తో.. నిఖిల్ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ సినిమా ఇచ్చిన బూస్టప్ తోనే ‘స్వయంభూ’ మీద కూడా నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు. రికవరీ అవ్వాలంటే.. మంచి రిలీజ్ డేట్ ఉండాల్సిందే. ఈ వేసవిలోనే ‘విశ్వంభర’ కూడా రాబోతోంది. అది కూడా వీఎఫ్ఎక్స్కి పెద్ద పీట వేసిన సినిమానే. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తారు.


